జిల్లా అదనపు ఎస్పీని కలిసిన మాచర్ల మాజీ ఎంపీపీ కుటుంబసభ్యులు 10న అక్రమ కేసులో మాజీ ఎంపీపీ కుమారులు అరెస్ట్ దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని అదనపు ఎస్పీని కోరిన బాధితులు రెండేళ్లుగా ఎమ్మెల్యే జూలకంటి కక్ష సాధిస్తున్నారని ఆరోపణ సంబంధం లేని కేసులో ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేశారని ఆవేదన
నరసరావుపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భయాందోళనలు సృష్టించేందుకే మాచర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలకు పంపారని, దీనిపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. అక్రమ కేసులో అరైస్టెన మాచర్ల మండలం నాగులవరానికి చెందిన మాజీ ఎంపీపీ బూడిద మంగమ్మ కుమారులు శ్రీనివాసరావు, సైదులు కుటుంబసభ్యులు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరిని కలిశారు. ఘటన జరిగిన మూడు నెలల తరువాత సంబందం లేని కేసులో తమ భర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ మాచర్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందిందన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో శ్రీనివాసరావు, సైదులు అక్కడికి వెళ్లి పరామర్శించి వచ్చారని తెలిపారు. ఈ ఘటన జూలై నెలలో జరిగితే ఈనెల 10వ తేదీ వీరిపై కేసు నమోదు జైలుకు పంపారని పేర్కొన్నారు. సంబంధం లేని కేసులో పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా గ్రామం విడిచి ఉంటున్నామని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమను బెదిరించడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే రెండేళ్లుగా వేధిస్తున్నారు
రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి తమ కుటుంబంపై రెండేళ్లుగా కక్షసాధింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని, కుట్ర రాజకీయాలను ప్రజలు హర్షించరని తెలిపారు. చేతనైతే ప్రజలకు మంచి పనులు చేయాలని, రెండేళ్లలో చేసిన పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మహిళ చనిపోతే సాయం చేసేందుకు కూడా తమకు హక్కు లేదా అని ప్రశ్నించారు.
వాహనాలు నిలిపివేత
అక్రమ కేసులపై జిల్లా అదనపు ఎస్పీని కలిసేందుకు వస్తున్న బాధితులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మాచర్ల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తున్న 15 వాహనాలను పోలీసులు మండలంలోని రావిపాడు వద్ద అడ్డుకున్నారు. అనుమతి తీసుకోలేదని వాహనాలను నిలిపివేశారు. వాహనాలను వెనక్కు పంపారు. బాధిత కుటుంబానికి చెందిన వారికి మాత్రమే జిల్లా అదనపు ఎస్పీని కలిసేందుకు అనుమతించారు. అనంతరం బాధిత కుటుంబానికి మద్దతుగా వచ్చిన వారు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఖండించారు.
నకరికల్లు : మాచర్ల నుంచి నరసరావుపేట వెళుతున్న వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నాయకులను నకరికల్లు అడ్డరోడ్డు వద్ద పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. నకరికల్లు అడ్డరోడ్డు వద్ద సీఐ కిరణ్, ఎస్‌ఐ సతీష్ అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని వెనక్కి పంపారు. తంగిరాల రామిరెడ్డి, బీర్నేడి రమేష్ బాబు, మట్టపల్లి బ్రహ్మం, మహమ్మద్ ఇస్మాయిల్, నారి, గుర్రం సాగర్‌బాబు, గోగుల సిద్ధ్దు, బి.అమర్, చింత ఇజ్రాయిల్, హరి నాయక్, నేలటూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


