నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులోని లగేజ్‌లో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటనతో నరసరావుపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు. బ్యాగ్‌లో దొరికిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్‌ల మూలాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ వ్యవహారానికి నరసరావుపేటతో సంబంధం ఉండటంతో స్థానిక పోలీసులు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. వివరాలు.... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆషిక్ అలీ కొంతకాలంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మాహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌లోని మున్నా మగ్గమ్ వర్క్స్‌లో పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండ్‌లో బస్కు ఎక్కి విజయవాడలో దిగాడు. అనంతరం బ్యాగ్ చూసుకోగా లగేజ్ మారినట్లు గుర్తించాడు. బ్యాగ్‌ను బస్టాండ్‌లో అవుట్‌పోస్టు పోలీసులకు అప్పగించాడు. పరిశీలించగా 46 గిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని బ్యాగ్ అప్పగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరసరావుపేట టూటౌన్ పోలీసులు కూడా అతడు పనిచేసే దుకాణం వద్దకు చేరుకొని అతని ఉద్యోగం, నివాసం, గత కదలికలపై ఆరా తీశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. కాగా ఇద్దరు మావోయిస్టులు సోమవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట లొంగిపోయారు. అదే సమయంలో లగేజీలో పేలుడు పదార్థాలు బయట పడటం చర్చనీయాంశంగా మారింది. రెండు ఘటనలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నట్లు సమాచారం.


