ఇద్దరికి తీవ్ర గాయాలు
క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామ శివారులో దమ్ముచక్రాల ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగవరం గ్రామ శివారులో దమ్ముచక్రాల ట్రాక్టర్ సత్తెనపల్లి వైపు వెళ్తుంది. అదే దిక్కున మండలంలోని హసనాబాద్ గ్రామానికి చెందిన తోకల లక్ష్మీనారాయణ, కాశింసెట్టి గణేష్ ద్విచక్రవాహనంపై సత్తెనపల్లి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో దమ్ముచక్రాల బండి, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనం పై ఉన్న ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరిని గుంటూరు జీజీహెచ్‌కు, మరొకరిని నరసారావుపేట ప్రభుత్వసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎస్‌ఐ పి.రవిబాబు మాట్లాడుతూ ప్రమాద సంఘటన తెలిసిందని, వివరాలు సేకరించాల్సి ఉందన్నారు.
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గ్రామానికి చెందిన కృష్ణవేణి(50) అనే మహిళ మృతిచెందింది. గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో కూడిన పిడుగు కృష్ణవేణి సమీపంలో పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త కృష్ణారెడ్డి పొలంలో కాస్తంత దూరంలో పనిచేస్తుండడంతో అతనికి ప్రమాదం తప్పినట్లయింది.


