దర్శి: పంట పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గత కొన్ని నెలలుగా ముండ్లమూరుతో పాటు పలు మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలతో కరెంట్ సరఫరా నిలిచి పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్సై కోటేశ్వరరావు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి 9 కేసుల్లో 12 మంది నిందితులను గుర్తించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వారిలో ఒంగోలులో నివాసముంటున్న పులి నాగరాజు (విప్పర్ల, రొంపిచర్ల మండలం), షేక్ రజాక్, పామూరి శ్రీకాంత్ (సంతమాగులూరు), పోలా మంగ (తూర్పుగంగవరం, తాళ్లూరు మండలం), రావూరి సురేష్ (ఉదయ్‌నగర్ తండా, నకరికల్ మండలం)లను అరెస్ట్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి రాగితీగను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జనపాటి బ్రహ్మయ్య (రాజుపాలెం, మార్టూరు మండలం), షేక్ మదర్షా (బోయపాలెం, యడ్లపాడు మండలం)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముండ్లమూరు మండలంలో 26, దర్శి పరిధిలో 10, దొనకొండలో 4, సంతమాగులూరులో ఒకటి చొప్పున మొత్తం 41 ట్రాన్స్‌ఫార్మర్లకు చెందిన 255 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముండ్లమూరులోని ఓ ఇంట్లో దివాన్‌కాట్ కింద దాచిన రూ.లక్షతో పాటు పర్సులోని వెయ్యి కలిపి మొత్తం రూ.1,01,000 నగదును కూడా ఈ ఐదుగురే చోరీ చేసినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి రూ.40 వేలను రికవరీ చేశారు. ఇదే ముఠాకు చెందిన పొట్లూరి ప్రభుదాస్ అలియాస్ నాని, అల్లంసెట్టి భాగ్యరాజు, రావూరి కలగయ్య, చేవూరి వంశీకళ్యాణ్, రావూరి గోపి, చేవూరి వెంకటేష్, తిరువీధుల లోకేష్‌లు గతంలో కృష్ణా జిల్లా అట్కూరు పరిధిలో చేసిన దొంగతనాల కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.


