సత్తెనపల్లి: ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తూ పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రతిపాదనలను విరమించుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాసరావు అన్నారు. సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ.నాగమణికి డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ పినాకిల్ అనే ప్రైవేటుకంపెనీకి అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిం చారు. ఈ ప్రతిపాదనలను తక్షణమే విరమించుకొని ప్రభుత్వ యాజమాన్యంలోనే రవాణా సేవలను కొనసాగించాలన్నారు. సత్తెనపల్లి డిపో పరిధిలో ఆర్టీసీ బస్సుల కొరత, విద్యార్థుల బస్సు పాసుల సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందు లను పరిష్కరించాలన్నారు. ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వేలాదిమంది విద్యార్థులకు, నిత్యం ప్రయాణించే సామాన్య ప్రజలకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడపకపోవడం శోచనీయమన్నారు. వేళాపాళాలేని బస్సు సర్వీసుల వల్ల విద్యార్థులు సమయానికి విద్యాసంస్థలకు చేరుకోలేక చదువు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో విద్యార్థులు, ప్రయాణికుల రవాణా హక్కుల పరిరక్షణకై డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె రాజ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకులు సీహెచ్ ఆంజనేయులు, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు


