ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..
టీడీపీ పాలనలో వంటింట్లో ‘ధరల’ మంటలు
సత్తెనపల్లి: జిల్లాలో నిత్యవసరాలు ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీగా వినియోగించే సరుకుల ధరలు భారీగా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రానున్న వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలకు అయ్యే ఖర్చు తలుచుకొని బెంబేలెత్తిపోతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే అన్ని ధరలు భారీగా పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
ఉదయమే కాఫీ, టీ లేనిదే అడుగు బయటపెట్టని వారికి పంచదార ధర చుక్కలు చూపుతోంది. రిటైల్ మార్కెట్లో జూలై నెలాఖరు నాటికి కిలో ధర రూ. 45 ఉండగా .. ప్రస్తుతం రూ. 75కు పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి పంచదార ధరలు మరింత పెరుగుతున్నాయి. 23 రోజుల్లోనే కిలోకు రూ. 30 పెరగడం షాక్‌కు గురిచేస్తోంది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదార వినియోగిస్తే సుమారు రూ. 150 అదనపు భారం కానుంది. ఇదే బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ఇప్పటివరకు రూ. 70 ఉన్న కిలో ప్రస్తుతం రూ. 90కి ఎగబాకింది. పండుగలకు మరింత పెరుగుతుందని వ్యాపారులే చెబుతున్నారు. రానున్న రెండు నెలలు పండుగలతోపాటు పెళ్లిళ్లు అధికంగా ఉన్నాయి. ప్రతి శుభకార్యంలోనూ తీపి తప్పనిసరి. ఈ క్రమంలో చక్కెర,బెల్లం ధర పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. బెల్లం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా పంచదార, బెల్లం, ఉల్లిపాయలు, వంట నూనె, పువ్వులు, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్ని రకాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. సంపాదనలో ఎక్కువ మొత్తం ఆహార అవసరాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్ని రకాల ధరలు పెరగడం పేద, మధ్యతరగతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
చంద్రబాబు పాలనలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆహార వస్తువుల ధరలతో సామాన్య ప్రజల జీవనం దిన దిన గండంగా మారింది. నెల రోజుల నుంచి ధరలు పెరుగుతున్నా .. కనీసం నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వంలో నిత్యవసరాల ధర కాస్త పెరిగిన వెంటనే చంద్రబాబు ఆధ్వర్యంలో రోడ్డెక్కి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసిన టీడీపీ నేతలు నేడు అధికారంలోకి రాగానే నోరు మెదపడం లేదు.
నిత్యం వాడే బియ్యం ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారం అధికమైంది. బియ్యం క్వింటా ధర ఒక్క నెలలోనే రూ.2 వేలు పెరిగింది. గత నెలలో 25 కిలోల బియ్యం బస్తా రూ. 1,300 ఉండగా .. ప్రస్తుతం రూ. 1,800కి చేరింది. ప్రస్తుతం క్వింటా బియ్యం రకాన్ని బట్టి రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకూ విక్రయిస్తున్నారు. సామాన్యులు ఏం తినాలి అంటూ నిట్టూరుస్తున్నారు. రైతులు వరి కోతలు పూర్తి చేసిన రోజే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏ రైతు వద్ద కూడా ధాన్యం లేవు. వ్యాపారుల చేతుల్లోకి వెళ్లగానే వారు బియ్యం ధరలను పెంచేసి లబ్ధి పొందుతున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన 34 సబ్సిడీ బియ్యం కౌంటర్లు అలంకారప్రాయంగా మారాయి. ఇక కిలో ఉల్లిపాయలు రూ.60, ఎండుమిరప రూ.340, ధనియాలు రూ.220, వేరుసెనగ నూనె కిలో గానుగ అయితే రూ. 300 పైనే పలుకుతోంది. ప్రతి శుభకార్యానికి ఉపయోగించే కొబ్బరికాయ ఒక్కొక్కటి రూ. 40 నుంచి రూ. 50 ఉంది.
చేదెక్కిన పంచదార, బెల్లం
భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
బియ్యానికి అమాంతంగా రెక్కలు
సలసలా కాగుతున్న వంటనూనెలు
ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్దయ
పేద, మధ్యతరగతి ప్రజల ఆవేదన


