నిబంధనలన్నీ ఇసుకలో పాతర | - | Sakshi
Sakshi News home page

నిబంధనలన్నీ ఇసుకలో పాతర

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

డంప్‌ చేసిన ఇసుకను తరలించొచ్చు

ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా

యథేచ్ఛగా తవ్వకాలు

పెద్ద లారీలలో బహిరంగంగానే రవాణా

కనీసం కన్నెత్తి కూడా చూడని

స్థానిక అధికారులు

చింతపల్లి వద్ద శుక్రవారం ఉదయం

కృష్ణానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు

సాక్షి, నరసరావుపేట: ఉచిత ఇసుక ముసుగులో కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు ఇసుకాసురులు తిలోదకాలు వదిలారు. పలు శాఖల అధికారులకు ముడుపులు చెల్లించి దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రోజుకు 50 నుంచి 100 లారీల వరకు తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రకృతి వనరుల పరిరక్షణ కాగితాలకే పరిమితమైంది.

ఈ ప్రాంతాల్లో తవ్వకాలు...

పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం పరిధి చింతపల్లి, కొత్తపల్లి సరిహద్దుల్లో కృష్ణానదిలో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకాసురులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఆరు పొక్లెయినర్లతో నది లోతుల్లో నుంచి తవ్వకాలు చేపట్టారు. నేరుగా పెద్ద ట్విన్‌ టైర్‌ లారీలకు ఎత్తుతున్నారు. ప్రస్తుతం పర్యావరణ నిబంధనల మేరకు మాన్‌సూన్‌ హాలిడే అమలులో ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్‌ 1 నుంచి అక్టోబరు 15 వరకు నదిలో ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. ముందుగా నది ఒడ్డున డంప్‌ చేసుకున్న ఇసుకను మాత్రమే అవసరాలకు తరలించుకోవాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు నదిలో తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు ఎవరికీ అనుమానాలు రాకుండా జూన్‌ 1 నాటికి డంప్‌ చేసుకున్న కుప్ప నుంచి మాత్రమే ఇసుక రవాణా చేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు.

నేరుగా తరలింపు...

రోజూ నది గర్భంలో పెద్ద పొక్లెయినర్లతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. నేరుగా భారీ లారీలకు ఓవర్‌లోడ్‌ చేస్తున్నారు. ఇసుకను అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రతి రోజు 50 నుంచి 100 లారీల వరకు ఇసుక తరలి వెళుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అక్రమార్కులు ఒక్కొక్క లారీకి ఇసుకను ఓవర్‌లోడ్‌ చేసినందుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసి తమ జేబులు నింపుకొంటున్నారు. ట్రాక్టర్లను అసలు నదిలోకి అనుమతించడం లేదు. వీరికి బడా ప్రజాప్రతినిధుల అండదండలున్నట్లు విశ్వసనీయ సమాచారం. మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులకు తెలిసినా మామూళ్లతో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

ఇసుక లోడ్‌తో

వెళుతున్న లారీ

జూన్‌ 1 నుంచి అక్టోబరు 15 వరకు మాన్‌సూన్‌ హాలిడే అమలులో ఉంది. దీని ప్రకారం కృష్ణానదిలో యంత్రాలతో గానీ, మాన్యువల్‌గా గానీ ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. నదికి సమీపంలోనే అంతకు ముందు డంప్‌ చేసుకున్న ఇసుకను ట్రాక్టర్లు, లారీలలో రవాణా చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల మేరకు మాత్రమే లోడ్‌ చేసుకోవాలి. ప్రస్తుతం కృష్ణానదిలో ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం లేదు. ఎవరైనా ఇలా చేస్తే మా సిబ్బందిని పంపి పనులు నిలిపివేయిస్తాం. సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటాం.

– నాగయ్య, మైనింగ్‌ ఏడీ, నరసరావుపేట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement