ప్రమాదం తర్వాతే హడావుడి...
● రోడ్డు ప్రమాదాలకు
బలవుతున్న సామాన్యులు
● జిల్లాలో ఈ ఏడాది 677
ప్రమాదాల్లో 232 మంది మృతి
● మృత్యు నిలయాలుగా మారిన
జాతీయ రహదారి జంక్షన్లు
చిలకలూరిపేట టౌన్/ యడ్లపాడు: రోడ్డుపై వాహనం దూసుకెళ్లే వేళ చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో కుటుంబాలే ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రమాదాలలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. కానీ ఆ తర్వాత మొదలయ్యే కుటుంబాల వేదన మాత్రం బయటకు కనిపించదు. సంపాదించే మనిషి లేకపోవడం.. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన.. అప్పుల భారం.. ఆసరా కోల్పోయిన వృద్ధుల కన్నీళ్లు.. ఇవన్నీ ఒక రోడ్డు ప్రమాదం వదిలి వెళ్లే గాయాలే.
జిల్లాలో ఇవీ నిదర్శనాలు...
యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వంతెనపై ఇటీవల రెండు భారీ వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమైన ఘటన ఇంకా స్థానికుల మదిలో నుంచి చెరిగిపోలేదు. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి ఆటోను బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దృశ్యం ఈ విషాదాన్ని కళ్లకు కట్టింది. ఒకే ప్రాంతానికి చెందిన కుటుంబాల్లో ఒక్కసారిగా అలుముకున్న విషాదం.. రహదారి భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమైంది. పల్నాడు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 677 ప్రమాదాలు చోటుచేసుకోగా, 232 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ప్రతి మరణం తర్వాత ఒక కుటుంబం విషాదంలో ఉందన్న విషయాన్ని మరిచిపోకూడదు.
అందరికీ కష్టాలే
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో కుటుంబాన్ని నడిపించే వయసులో ఉన్నవారే, చేతికి అందివచ్చే యువతే అధికంగా ఉంటున్నారు. నిన్నటి వరకు ఇంటి ఖర్చులు చూసిన వ్యక్తి.. ఈరోజు ఫొటోలో మాత్రమే మిగిలిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా దిక్కులేనిదవుతుంది. నెలవారీ ఆదాయం ఆగిపోతుంది. పిల్లల చదువులకు డబ్బు ఉండదు. అప్పులు పెరుగుతాయి. బతుకుబండిని లాగేందుకు కుటుంబ సభ్యులు కొత్త పోరాటం మొదలుపెట్టాల్సి వస్తుంది. కొన్ని ఇళ్లలో తండ్రి మరణిస్తే పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతాయి. తల్లి ఒక్కరే కుటుంబ బాధ్యత మోయాల్సి వస్తుంది. మరికొన్ని ఇళ్లలో జీవితాంతం తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడిని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు మిగిలిపోతారు. బిడ్డను కోల్పోయిన బాధకు తోడు.. వృద్ధాప్యంలో తమ భవిష్యత్తు ఏమిటన్న భయం వారిని వెంటాడుతుంది.
బతికిన వారికి మరో పోరాటం..
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారందరి పరిస్థితి మరో కన్నీటి గాథ. తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమయ్యే వారు ఎందరో. చేతులు, కాళ్లు పనిచేయకపోవడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం వంటి సమస్యలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. వైద్యం కోసం పొలాలు అమ్ముకోవడం.. ఇళ్లు తాకట్టు పెట్టడం.. బంగారం విక్రయించడం.. అప్పులు చేయడం సాధారణంగా మారిపోయింది. ప్రాణం నిలిచినా కుటుంబం అప్పుల పాలైతే.. ఆ ప్రభావం సంవత్సరాల తరబడి వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా...
చిలకలూరిపేట పరిధిలోని ఎన్‌హెచ్–16, 167/ఏ హైవేలపై పలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. పసుమర్రు హైవే జంక్షన్, బొప్పూడి ఆంజనేయస్వామి ఆలయం, అడ్డరోడ్డు సెంటర్, విజయబ్యాంకు ప్రాంతం, ఎన్‌ఆర్‌టీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, తిమ్మాపురం జంక్షన్, యడ్లపాడు ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ రోడ్డు, బోయపాలెం హైవే వంతెన ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రతిసారీ కొంతకాలం హడావుడి కనిపించడం.. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితులు కొనసాగడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ప్రకటించడం కంటే.. ప్రమాదం జరగకుండా ముందే అడ్డుకోవడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత కావాలి. ప్రమాదకర ప్రాంతాలను శాసీ్త్రయంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలి. అలాగే రహదారిపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్టీరింగ్ వెనుక కూర్చున్న వ్యక్తి ఒక్కడే కాదు.. అతని కోసం ఒక కుటుంబం ఎదురుచూస్తోంది. ఒక్క నిమిషం ఆలస్యమైతే పెద్ద నష్టం లేదు. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం చేస్తే.. తిరిగి రాని ప్రాణం పోతుంది. ఆ ప్రాణంతో పాటు ఒక కుటుంబం నవ్వు కూడా ఆగిపోతుంది. అందుకే రహదారిపై వేగం కంటే ప్రాణానికి విలువ ఇవ్వాలి. నిబంధనలను భయంతో కాదు.. ఇంటివద్ద ఎదురుచూస్తున్న వారి కోసం పాటించాలి. ఈ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


