మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న డ్రగ్స్ తనిఖీలు మరిచిపోయిన ఈగల్ టీం ఏడాదిన్నరగా కనిపించని దాడులు పల్నాడులో ఎండీఎంఏ డ్రగ్స్ మూలాల కలకలం అక్రమ ఔషధాలపై నిఘా శూన్యం
ఆ గోదాములపై నిఘా ఏది..?
నరసరావుపేట టౌన్: మత్తు మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఆపరేషన్ గరుడ పేరిట మొదట హడావుడి చేసి నామమాత్రపు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకొంది. కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా తనిఖీలు చేపట్టకపోవడంతో పల్నాడు జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం విస్తరిస్తోంది. విద్యాకేంద్రంగా పేరొందిన నరసరావుపేట పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమార్కులు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులను మహమ్మారికి బానిసలను చేయడంతోపాటు అక్రమ రవాణా ఊబిలోకి తీసుకువచ్చి బంగారు భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎండీఎంఏ మూలాలపై దృష్టేది..?
గత ప్రభుత్వ హయాంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) సత్ఫలితాలనిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీం నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అన్నింటికంటే ఆందోళన కలిగిస్తున్న అంశం ప్రమాదకరమైన ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాల మూలాలు పల్నాడు జిల్లాలో వెలుగుచూడటం. రెండు నెలల క్రితం నరసరావుపేటకు చెందిన ముగ్గురు యువకులు ప్రమాదకర ఎండీఎంఏ మాదకద్రవ్యాన్ని బెంగళూరు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ చిలకలూరిపేట పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. ఎండీఎంఏ మూలాలపై అధికారులు దృష్టి సారించలేదు. ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి.. వాటిని వినియోగిస్తోంది ఎవరు.. అక్రమ వ్యవహారం అంతటికీ తెరవెనుక ఉన్న మాఫియా ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. మత్తు పదార్థాల వ్యవహారాన్ని కేవలం చిన్న కేసులతో ముగిస్తే అసలు నెట్‌వర్క్ బయటపడే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఔషధ దుకాణాల్లో తనిఖీలేవీ?
పల్నాడు జిల్లాలో సుమారు 900 హోల్‌సేల్, రిటైల్ ఔషధ దుకాణాలు ఉన్నట్లు వ్యాపార వర్గాల సమాచారం. ఆపరేషన్ గరుడలో భాగంగా గతేడాది మార్చి 21వ తేదీన ఈగల్ టీం దాడులు నిర్వహించి నరసరావుపేట బరంపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.18.40 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం చేసుకుంది. ఆ తనిఖీలు నిర్వహించి ఏడాదిన్నర కావస్తున్నా, ఆ తర్వాత ఈగల్ బృందం దాడులు పెద్దగా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా మందుల గోదాములు, హోల్‌సేల్ ఏజెన్సీలు, భారీ స్థాయిలో మందుల సరఫరా చేసే డీలర్లపై విస్తృత తనిఖీలు ఎందుకు జరగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకుంటున్న కొందరు వ్యాపారులు తనిఖీలకు ముందే అప్రమత్తం అవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
నకిలీ మందులకు అడ్డా
నరసరావుపేటలో భారీ స్థాయిలో ఔషధాల హోల్‌సేల్ వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాలకు పెద్దఎత్తున మందులు సరఫరా అవుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రాండెడ్ కంపెనీలను పోలిన నకిలీ లేదా నిషేధిత మందుల సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆరోపణలకు సంబంధించి అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నకిలీ మందులు మార్కెట్లోకి వస్తే వాటిని వినియోగించే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కొంతమంది ఔషధ వ్యాపారులు ‘జీరో’ బిల్లింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బిల్లింగ్ వ్యవస్థకు దూరంగా జరిగే లావాదేవీలు పెరిగితే మందుల అసలు మూలం, సరఫరా మార్గాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఔషధ గోదాములు అనేకం ఉన్నాయి. ఒకదానికి అనుమతులు తీసుకుని అనధికారికంగా మరో రెండు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వాటిలో రూ.కోట్ల విలువైన అక్రమ మందుల నిల్వలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం ఉన్నప్పటికీ అధికారులు వాటిపై పూర్తిస్థాయి తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్ బృందం మళ్లీ క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ సరఫరాతో పాటు వాటి వెనుకున్న నెట్‌వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉంది.


