సాగర్‌ ఆయకట్టు రైతులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ఆయకట్టు రైతులకు అన్యాయం

Aug 19 2026 1:47 AM | Updated on Aug 19 2026 1:47 AM

మిగులు నీటిని సాగు, తాగు అవసరాలకు ఇవ్వని టీడీపీ ప్రభుత్వం నోరెత్తని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే నీరు విడుదల చేయాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: నాగార్జునసాగర్‌ కుడికాలువ పరిధిలోని సాగు, తాగు అవసరాలకు నీరందించకుండా రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజలు, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కనీసం మెట్ట పంటలు వేసేందుకు కూడా అవసరమైన వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదని పేర్కొన్నారు. గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డెల్టా ప్రాంతాలైన కృష్ణా జిల్లా, తెనాలి, బాపట్లకు తొలుత నీరు విడుదల చేయాలని గతంలోనే అనేక కమిటీలు నిర్ణయించాయన్నారు. పులిచింతల, పట్టిసీమల ద్వారా ఈ ప్రాంతాలకు నీటి ఇబ్బంది లేదని చెప్పారు. మిగిలిన సాగర్‌ కిందనున్న 11 లక్షల ఎకరాల ఆయకట్టు నేడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సాగర్‌లో 132 టీఎంసీల మిగులు నీటిని ఆయకట్టులోని సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని తీర్మానం చేశారన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు.

సాగర్‌ నుంచి చుక్కనీరు లేదు...

ప్రస్తుతం శ్రీశైలంలో 176 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా ఒక్క చుక్క కూడా కిందకు విడుదల చేయడం లేదన్నారు. ఎగువన ఉన్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి మూడు వేల క్యూసెక్కులు సాగు, తాగునీటి కోసం విడుదల చేశారని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి భీమా–1, భీమా–2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ల నుంచి నీరు విడుదల చేయగా రైతులు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్క నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలకు మాత్రమే ఇప్పటివరకు చుక్క నీరు అందించలేదన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే...

రైతులకు సాగునీరు విడుదల కాక, చిన్నపాటి వర్షం కూడా కురవక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆరుతడి, మెట్ట పైరులైన జొన్న, పత్తి, మిర్చి పంటలు పండించేందుకు నీరివ్వాలని తమ పార్టీ కోరుతోందన్నారు. పశువులకు మేత కూడా లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం రివాజుగా మారిందన్నారు. గతంలో 2002–03లో కూడా ఇదే పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. కరువు నివారణకు ఎటువంటి చర్యలూ ఇప్పటివరకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్‌లో 527 అడుగుల నీరు ఉందని, ఈ పరిస్థితిలో గతంలో ఆరుతడి పంటలకు నీరు ఇచ్చేవారన్నారు. మిగులు నీటిని సాగుకు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. భవిష్యత్‌లో నీటి కోసం రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, నరసరావుపేట మండల కన్వీనర్‌ తన్నీరు శ్రీనివాసరావు, గెల్లి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement