జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి సమీక్షలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానల్స్ అమర్చడంలో పల్నాడు జిల్లా చాలా వెనుకబడి ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో కలిసి డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను కోరారు. అటవీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేసేటప్పుడు అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు చాలా నెమ్మదిగా ఉందని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సీఈవో వి. జ్యోతి బసు, జిల్లా అటవీ శాఖ అధికారిణి డీవీ రమణ, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘నీటి’ పనులపై దృష్టి ముఖ్యం
జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించడానికి జల్‌జీవన్ మిషన్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.


