భార్య రెండో పెళ్లి చేసుకుందని భర్త ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

భార్య రెండో పెళ్లి చేసుకుందని భర్త ఫిర్యాదు

Aug 19 2026 1:47 AM | Updated on Aug 19 2026 1:47 AM

భార్య రెండో పెళ్లి చేసుకుందని భర్త ఫిర్యాదు మైదుకూరు: విడాకులు తీసుకోకుండానే తన భార్య రెండో పెళ్లి చేసుకుందని మైదుకూరు పట్టణంలోని రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన కాకిమాను వెంకట నరేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన రెడ్డప్ప కుమారుడు వెంకట నరేష్‌కు పల్నాడు జిల్లా చిన్నకొండాయపల్లెకు చెందిన తురుమెల్ల దుర్గారావు కుమార్తె ప్రవల్లికతో 2022 ఆగస్టు 13న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్నాళ్లకు నరేష్‌ భార్య రాజీవ్‌ గాంధీ నగర్‌కే చెందిన నరేష్‌ బంధువు అయిన తిరువాయిపాటి సందీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయమై మామ రెడ్డప్ప, భర్త నరేష్‌.. ప్రవల్లికను మందలించారు. అది మనసులో పెట్టుకొని నరేష్‌తో, అత్తమామలతో ఆమె చీటికిమాటికి గొడవపడేది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రవల్లిక కాపురం చేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన భార్య తన బంధువైన సందీప్‌ను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో నరేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలతో తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకోలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్‌ పేర్కొన్నారు. చట్టపరంగా విడాకులు తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన భార్య రెండో వివాహం చేసుకుందని తెలిపారు. తన భార్యపై, ఆమెను వివాహం చేసుకున్న సందీప్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వృద్ధురాలి ఆత్మహత్య నాదెండ్ల: ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నాదెండ్లలో చోటుచేసుకుంది. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాట్రగడ్డ అమరమ్మ (73) మంగళవారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచింది. ఈమె భర్త గతంలోనే మృతి చెందగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు గ్రామంలోనే నివసిస్తుండగా, చిన్న కుమారుడు విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విజ్ఞాన్‌ వర్సిటీని సందర్శించిన ఎన్‌టీటీఎం బృందం యాచకుడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు

చేబ్రోలు: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌ (ఎన్‌టీటీఎం)కు చెందిన అధికారుల బృందం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీని మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఎన్‌టీటీఎం ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ప్రయోగశాల, మౌలిక వసతులను అధికారులు పరిశీలించడంతో పాటు విద్యార్థులు, టెక్స్‌టైల్‌ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమైనట్లు వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భాస్కర్‌ కల్రా నాయకత్వం వహించారు. ఆయనతో పాటు ఎన్‌టీటీఎం సెక్షన్‌ ఆఫీసర్‌ శుభం నర్వాల్‌, సీనియర్‌ అసోసియేట్‌ అరుషి సేథి పాల్గొన్నారు. ఎన్‌టీటీఎం సహకారంతో ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ ఎమిషన్‌ స్కానింగ్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ (ఎఫ్‌ఈఎస్‌ఈఎం) సదుపాయాన్ని ప్రారంభించారు. సుమారు 200 మంది విద్యార్థులతో స్టూడెంట్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 40 మంది పరిశ్రమ ప్రతినిధులతో ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయ పథకాలను మరింత విస్తృతంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తెనాలిరూరల్‌: డబ్బు కోసం యాచకుడిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పట్టణ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యాచకుడు కుంచాల వెంకటనారాయణ(70) 2025 జూన్‌ 8న రాత్రి మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, హత్య కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్‌ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్‌ను అరెస్టు చేశారు. వృద్ధుడు యాచించగా వచ్చిన డబ్బును దగ్గర ఉంచుకొని స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్‌ డిపో వద్ద నిద్రించాడు. అతని వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గమనించిన రాజేష్‌ నిద్రపోతున్న వెంకటనారాయణ పై దాడి చేసి హతమార్చి నగదును అపహరించి పరారయ్యాడు. పైగా వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. నిందితుడు మృతుడి నుంచి అపహరించిన రూ.మూడు వేలలో రూ.300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి, అప్పటి త్రీ టౌన్‌ సీఐ ఎస్‌.రమేష్‌బాబు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు మంగళవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు నిందితుడికి బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 101(1) కింద జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 309(4) కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 238 కింద ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ ఎంవీ సాంబశివరావు వాదించారు.

గుంటూరు రూరల్‌: రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేంద్రియ సాగు విధానం, అందుకు అవసరమైన కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండించిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడింపు వంటి అంశాలపై గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘రైతు శిక్షణా కేంద్రం’లో ఈనెల 27, 28, 29 తేదీలలో (గురు, శుక్ర, శనివారం) 3 రోజులు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణలో పొల్గొనే రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనదలచిన రైతులు 97053 83666, 95538 25532 ఫోన్‌ నెంబర్లలో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement