నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలు కల్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడిపేందుకు సిద్ధమైంది. పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


