ముఖ్యమైన తేదీలు
గత విద్యాసంవత్సరంలో ప్రవేశాలు
సత్తెనపల్లి: కుటుంబం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారికి ఏపీ ఓపెన్ స్కూల్ విధానం అండగా నిలుస్తోంది. వివిధ పనులు, వృత్తులు, ఉద్యోగాలు చేసుకునే వారికి నేరుగా పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం కల్పిస్తోంది. 14 ఏళ్లు దాటితే పదో తరగతి, 15 ఏళ్లు దాటి, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్ పరీక్షలకు హాజరు కావచ్చు. కారుణ్య నియామకాలు, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. పదవ తరగతి, ఇంటర్ మధ్యలో మానేసిన విద్యార్థులకు, ఫెయిల్ అయిన వారు రాసుకోవచ్చు. జిల్లాలో ఎస్సెస్సీకి 24, ఇంటర్‌కు 30 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి పీఎం శ్రీ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో నిర్వహించే ఈ సార్వత్రిక విద్యా ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ప్రవేశాలు ఇలా...
ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీలోపు అడ్మిషన్ పొందవచ్చు. రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు ఒకటి నుంచి 15 వరకూ అవకాశం ఉంది. పదో తరగతికి సంబంధించి జనరల్ పురుషులకు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కలిపి రూ.1,550, అన్ని వర్గాల సీ్త్రలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ పురుషులు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్‌కు సంబంధించి జనరల్ పురుషులకు రూ.1,800, అన్ని వర్గాల మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మైనార్టీ వారికి రూ.1,500 చొప్పున ఫీజు ఉంది. సార్వత్రిక పాఠశాలలో చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు అందించే సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది.
మార్కుల బదలాయింపు...
పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్ చదివి ఉత్తీర్ణులు కాలేకపోతున్న వారు కూడా సార్వత్రిక పాఠశాలల్లో చేరి సులభంగా ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఉత్తీర్ణులు అయ్యేందుకు అవకాశం ఉంది. రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫెయిలైనప్పటి నుంచి ఐదేళ్ల లోపు సార్వత్రిక పాఠశాలలో చేరితే రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్‌లో ఉత్తీర్ణులైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులను బదిలాయించుకునే వీలుంటుంది.టెన్త్‌లో హిందీ మార్కులను మాత్రం బదలాయించరు. ఇలా బదలాయించుకున్న వారు మిగిలిన మూడు సబ్జెక్టుల పరీక్షలు రాస్తే సరిపోతుంది. మార్కులు బదలాయించుకునేవారు ఎస్సెస్సీకి అయితే సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌కు రూ.150 చొప్పున అడ్మిషన్ సమయంలో అదనంగా చెల్లించాలి.
అడ్మిషన్ల ప్రారంభం : జూన్ 12
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు : జులై 31
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : జులై 31
అపరాధ రుసుంతో చివరి తేదీ : ఆగస్టు 15
వెబ్‌సైట్: ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీవోవీ.ఇన్
జిల్లా టెన్త్ ఇంటర్
గుంటూరు 910 1,923
పల్నాడు 1,021 2,294
బాపట్ల 583 1,829


