నరసరావుపేట: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 25 శనివారం నుంచి 27 సోమవారం వరకు మూడురోజులపాటు అభిషేకాలు అభిషేక మండపంలోనే నిర్వహించటం జరుగుతుందని సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
సోషల్ మీడియా పోస్ట్ కేసులో యువకుడికి బెయిల్
చిలమత్తూరు: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సోషిల్ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన వీర ప్రతాప్‌రెడ్డికి హిందూపురం స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి హిందూపురంలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడికి వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అండగా నిలిచారు. ఆమె సూచన మేరకు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి బాధితుడి తరుఫున వాదనలు వినిపించారు. ఈ మేరకు న్యాయమూర్తి బాధితుడి సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కాగా బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా మడకశిర పోలీసులు బాధితుడిని పోలీసు జీపులో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే బాధితుడిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక డిమాండ్ చేశారు.
రాగితీగల చోరీ
ముఠా గుట్టురట్టు
మంగళగిరిరూరల్: నిర్మాణంలో ఉన్న భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్‌ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 28 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపా రు. స్వాధీనం చేసుకున్న రాగి తీగ విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని కాజా టోల్‌గేట్ సమీపంలోని ఓ టెక్ పార్క్‌లో భద్రపరిచిన 20 బండిళ్ల ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురయ్యాయని జూన్ 6న నిర్మాణ కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో కాజా, చినకాకాని ప్రాంతాల్లో నిర్మాణ భవనాల నుంచి వైర్లు చోరీ చేసి వాటిని కాల్చి కాపర్‌గా మార్చి పేరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గండాలయ్యపేట, తాడికొండ, పేరేచర్లలకు చెందిన మొగిలి మధు, జగన్నాథం, ఏసుబాబు, సాంబయ్య, నాగ తేజ, ఉయ్యాల సతీష్ లపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందన్నారు.


