వినుకొండ: వినుకొండ పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో దొంగలు తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి వైర్లను దొంగిలిస్తుండటంతో స్థానికులతోపాటు విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్ సమీపంలోనే దుండగులు ఈ దౌర్జన్యానికి ఒడిగడుతుండటం గమనార్హం. విద్యుత్ తీగలను తెంచేయడమే కాకుండా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కిందకు తోసివేసి వాటిలోని విలువైన రాగి (కాపర్) పరికరాలను దోచుకెళ్తున్నారు. అంతేకాకుండా కాలనీలోని ఇళ్ల విద్యుత్ మీటర్లు, నీటి బోర్లకు సంబంధించి అమర్చిన వైర్లను కూడా చోరీ చేస్తున్నారు. దొంగల భయంతోపాటు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పలువురు బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేసి అద్దె ఇళ్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కాలనీలో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి చోరీ..


