కొత్త బైపాస్‌లో రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కొత్త బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

● కంటైనర్‌ను ఢీకొట్టిన కారు ● కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన కంటైనర్‌ ● గుంటూరు యువకుడికి తీవ్ర గాయాలు

యడ్లపాడు: క్షణకాలపు నిద్రమత్తు... జీవితాన్నే చీకట్లోకి నెట్టేసేంత పెనుప్రమాదమై ముంచుకొచ్చింది. కనురెప్పల వెనుక చేరిన అలసట, వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపలేకపోయింది సరే... ఏకంగా వాహనం ధ్వంసం కావడంతో పాటు దానిని నడుపుతున్న డ్రైవర్‌ను కూడా తీవ్రగాయాల పాలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని నూతన పెట్రోల్‌ బంకు సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. 16వ నంబర్‌ జాతీయ రహదారి కొత్త బైపాస్‌పై గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కారు కంటైనర్‌ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. దానిని గమనించని కంటైనర్‌ డ్రైవర్‌ వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, టైర్లు వేడెక్కి అరిగిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి కంటైనర్‌ను నిలిపివేసి, కారులో చిక్కుకుపోయిన గుంటూరుకు చెందిన ఉప్పుటూరు హర్ష (33)ను ఎంతో శ్రమించి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్షను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గుంటూరు నుంచి బాపట్ల జిల్లా మార్టూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారులో అతనొక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన వాహనాన్ని రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement