నేడు కలెక్టరేట్‌లో ’ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ’ప్రజాసమస్యల పరిష్కార వేదిక’

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

నేడు కలెక్టరేట్‌లో ’ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ లారీ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతంతో మహిళ మృతి టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్‌లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజన సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుందని, నోటీసులు, ఎండార్స్‌మెంట్లు, వాట్సాప్‌ ద్వారా, రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా పీజీఆర్‌ఎస్‌ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చునని, గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్‌ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్‌కు కాల్‌ చేయవచ్చునన్నారు.

నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ కె.సతీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొనుగుపాడు గ్రామానికి చెందిన గద్దె కోటేశ్వరరావు(55) అడిగొప్పుల వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుండ్లపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కె.సతీష్‌ చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నరసరావుపేట రూరల్‌: ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో పలువురు గాయపడిన ఘటన శనివారం రాత్రి వినుకొండ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇల్లా ఉన్నాయి... విజయవాడ నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ రోడ్డులో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురికి గాయాలయ్యాయి. బస్సు ముందు భాగంతోపాటు కుడివైపున దెబ్బతింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్‌ పోలీసులు తెలిపారు.

యడ్లపాడు: విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేడిద అరుణ (45) తన పశువుల పాక వద్ద విద్యుత్‌ మోటారు ద్వారా నీటిని పట్టుకుంటుండగా విద్యుత్‌షాక్‌కు గురైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త దావీదు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్‌ 5వ లైన్‌లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్‌ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్‌ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్‌ సెంటర్‌ మెయిన్‌ రోడ్‌ వైపు నుంచి బస్టాండ్‌ వైపు వెళుతున్న టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement