పింఛను తొలగిస్తారనే ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పింఛను తొలగిస్తారనే ఆత్మహత్య

Aug 26 2025 7:46 AM | Updated on Aug 26 2025 7:46 AM

పింఛన

పింఛను తొలగిస్తారనే ఆత్మహత్య

చాగంటివారిపాలెంలో మృతుడి భార్య రామలింగమ్మ ఆవేదన ముప్పాళ్ళ పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు మృతుడికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, డాక్టర్‌ గజ్జల నివాళి బాధిత కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా

ముప్పాళ్ళ: పింఛను తొలగిస్తారనే దిగులుతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మారూరి రామలింగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగ పెన్షన్‌ పొందుతున్న రామలింగా రెడ్డికి వెరిఫికేషన్‌ పేరిట నోటీసులు ఇవ్వడంతో పెన్షన్‌ తొలగిస్తారనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి సోమవారం రాత్రి చాగంటివారిపాలెంలో రామలింగారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రామలింగమ్మ మాట్లాడుతూ కేవలం కూటమి ప్రభుత్వం, మండల అధికారి వల్లనే తన భర్త చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముప్పాళ్ళ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కుటంబ గొడవగా చిత్రీకరణ

అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్‌ ఆపేస్తారని నోటీస్‌ ఇవ్వటంతో తట్టుకోలేక రామ లింగారెడ్డి మృతి చెందారన్నారు. నోటీసు ఇవ్వడంతో దిగులుతో ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదని రామలింగమ్మ చెబుతున్నట్లు గుర్తుచేశారు. రామ లింగారెడ్డి మృతి చెందడంతో పరామర్శించేందుకు సోమవారం రాత్రి 8 గంటలకు తాము వస్తే మధ్యాహ్నం నుంచే టీడీపీ వారు ఇది ఇంటి గొడవ అని, దీనిని సుధీర్‌ భార్గవరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇష్యూ చేస్తున్నారని పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌ నుంచి రామలింగారెడ్డికి పెన్షన్‌ వస్తోందన్నారు. అప్పటి ప్రభుత్వ వైద్యుడు పరీక్షించి 40 శాతం ఉందని నిర్ధారించారన్నారు. ఇప్పుడు రీవెరిఫికేషన్‌ సాకు చెప్పి పెన్షన్‌ తొలగించటం చూస్తున్నామని పేర్కొన్నారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని పెన్షన్‌ తొలగింపునకు నోటీసు ఇవ్వడంతో బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తుచేశారు. అచ్చంపేటలో తల్లిదండ్రులపై ఆధారపడిన బాలుడికి కూడా దివ్యాంగ పెన్షన్‌ తీసేశారని పేర్కొన్నారు. పెద్ద తురకపాలెంలో మహిళకు కళ్లు కనిపించక, కాళ్లు పనిచేయక పూర్తిగా మంచంపై ఉందన్నారు. మహిళకు వైకల్యాన్ని 90 శాతం నుంచి 56 శాతానికి తగ్గించారన్నారు. అంటే రూ.15 వేల పింఛనును రూ.6 వేలకు తెచ్చారన్నారు. ఇలా పెన్షన్‌లు తొలగించే ప్రాసెస్‌లోనే ఇలా చేశారన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు రోళ్ళ మాధవి, పార్టీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి (చిన్నా), భవనం రాఘరెడ్డి,గొలమారి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

పింఛను తొలగిస్తారనే ఆత్మహత్య 1
1/1

పింఛను తొలగిస్తారనే ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement