
పేదింటి ‘ఆశాజ్యోతి’
తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో అర్హత కన్నవారి కష్టానికి ప్రతిఫలమన్న యువతి
పెదకూరపాడు: పేదరికం ఉన్నా పట్టుదలతో ఏదైనా సాధించ వచ్చునని నిరూపించారు మన్నం ఆశాజ్యోతి. తల్లిదండ్రులు నిరుపేదలైనా ఎంతో కష్టపడి ముగ్గురు ఆడ బిడ్డలను చదివించారు. వీరిలో పెద్ద కుమార్తె ఆశాజ్యోతి తొలి ప్రయత్నంలోనే ఇటీవలి డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించారు.
ఒకేసారి మూడు అవకాశాలు
పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామానికి చెందిన మన్నం చిన్నప్ప, లూర్ధుమేరీలకు ముగ్గురు ఆడబిడ్డలు. పెద్ద కుమార్తె ఆశాజ్యోతి చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ప్రాథమిక విద్యను జలాలపురం గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ స్కూల్‌లో, పదో తరగతిని అమరావతి గురుకుల పాఠశాలలో పూర్తిచేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో, డిగ్రీ తిరుపతి మహిళా యూని వర్సిటీలో చదివారు. తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఏ బయాలజీలో 79.06 మార్కులతో 12వ ర్యాంకు, టీజీటీ బయాలజికల్ సైన్స్‌లో 76.13 మార్కులతో 18వ ర్యాంకు, టీజీటీ జనరల్ సైన్స్‌లో 68.13 మార్కులతో 15వ ర్యాంకు సాధించారు.
చెల్లెళ్లను కూడా తీర్చిదిద్దుతా
ఆశాజ్యోతి మాట్లాడుతూ.. ముగ్గురు ఆడ బిడ్డలం అయినా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ నమ్మకంతో కష్టపడి చదివించారన్నారు. వారి కష్టాల ఫలితమే ఈ విజయమని తెలిపారు. వారి స్ఫూర్తితో చెల్లెళ్లను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతానన్నారు.