
‘మట్టి’ మేలు తలపెట్టవోయ్..!
మట్టి వినాయక ప్రతిమలు పర్యావరణ హితం
అవగాహన కల్పిస్తున్నాం
పీఓపీ విగ్రహాలతో ప్రమాదం
వినాయక చవితి సందడి మొదలైంది. పల్లె, పట్టణం, వీధి, కాలనీ అనే తేడా లేకుండా వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పలుచోట్ల ఉత్సవ పందిళ్లు వెలుస్తున్నాయి. రంగుల విగ్రహాలు దర్శనమిస్తుండటంతో కొనుగోళ్లకు యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారైన విగ్రహాల వినియోగం మంచిది కాదని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
సత్తెనపల్లి: వినాయక చవితి పండుగ అంటే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కలసిమెలసి చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకొంటారు. ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వేడుకలకు ప్రధానంగా గణపయ్య విగ్రహం ఉండాలి. చాలా మంది మార్కెట్లో దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన రంగుల విగ్రహాలను తీసుకొచ్చి పూజిస్తారు. రసాయనాలతో తయారు చేసిన ఈ విగ్రహాల కంటే మట్టితో రూపొందిన వాటిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో శ్రేయస్కరమని విద్యావంతులు చెబుతున్నారు. సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే ముడి సరుకుతో చేసే వినాయక ప్రతిమలు శ్రేష్టం.
మట్టితో విడదీయరాని బంధం..
మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహారాధన వరకు వచ్చాయి. సాధారణంగా మిగతా దేవతామూర్తుల విగ్రహాలను కళాకారులు రాయితో మలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల అనంతరం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి ఉన్నందున సులువుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేస్తున్నారు. ఇటీవల విగ్రహాల ఏర్పాటు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యలో పెద్ద విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఉందని విద్యావంతులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
కొంతలో కొంత మార్పు...
గతంలో కంటే ప్రస్తుతం కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా ఇళ్లల్లో కొలువు తీర్చే గణపయ్యలను మట్టితో చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కళాకారులు మట్టితో చిన్న విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. వీధుల్లో, గ్రామాల్లో ఏర్పాటు చేసే భారీ గణపయ్యలను కూడా మట్టితో చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. సహజ సిద్ధంగా లభించే బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరిగి పోతాయి. నిమజ్జనం చేసినా నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎలాంటి కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరగవు. రసాయన అవశేషాలు ఉంటాయి. నిమజ్జనంతో నీరు కలుషితం అవుతుంది.
నీటిలో జీవరాశులు కూడా రోగాల బారిన పడతాయి. ఈ నీటిని తాగితే వ్యాధులకు దారితీస్తుంది. అలాగే చర్మవ్యాధులు సోకుతాయి. పంట పొలాలకు ఈ నీరు చేరితే దిగుబడులు తగ్గిపోతాయి.
మట్టి వినాయక విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తున్నాం. మా వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.
– కొత్తా రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడు, ఆర్యవైశ్య యువజన సంఘం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు యువత ఆకర్షితులు అవుతున్నారు. వాటి వల్ల భావితరాల మనుగడకే పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసే నీళ్లను వినియోగిస్తే అనేక రకాల వ్యాధులు సోకుతాయి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహా లనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
– మాడా మల్లికార్జునరావు, అధ్యక్షుడు, అభ్యుదయ విజ్ఞాన సమితి

‘మట్టి’ మేలు తలపెట్టవోయ్..!

‘మట్టి’ మేలు తలపెట్టవోయ్..!

‘మట్టి’ మేలు తలపెట్టవోయ్..!