
ఇక్కడే తాగండి
జిల్లాలో 129 పర్మిట్ రూమ్‌లు
ఎక్కడో ఎందుకు..
వైన్ షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి
మద్యం ప్రియులు ఇప్పటి వరకు చెట్ల కింద, రోడ్ల వెంట తాగుతూ భయపడుతున్నారు. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే వైన్ షాపుల్లోనే సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం దుకాణంలో ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటే.. ఉత్తరం గదిలో గ్లాసులు, మంచింగ్, దక్షిణం గదిలో టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంది. పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.
నరసరావుపేటటౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రైవేటు పెత్తనాన్ని పక్కకు నెట్టేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఇదే సమయంలో ప్రజలను మద్యానికి దూరం చేయాలనే సంకల్పంతో కొన్ని బ్రాండ్ల విక్రయాన్ని నిలిపేసింది. మరో వైపు పేదలకు అందుబాటు ధరలో ఉంచకుండా చర్యలు తీసుకుంది. ఇలా మద్యం నియంత్రణకు తీవ్రంగా కృషి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త మద్యం పాలసీని ప్రవేశపెడుతున్నామని చెబుతూనే.. గత వైఎస్సార్ సీపీపై విపరీతమైన విమర్శలు గుప్పించారు. మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మద్యం నియంత్రణతోపాటు డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ అధికారం చేపట్టిన వెంటనే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లారు. వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీంతో రాత్రి వేళ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు అర్ధరాత్రి ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా క్రైమ్ రేటు పరిశీలిస్తే మద్యం మత్తులోనే ఎక్కువగా నేరాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారుల కళ్లకు మామూళ్ల మత్తు కమ్మడంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద ఘర్షణలు పెరిగిపోయాయి. వీటిపై దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చేసింది. ఎక్కడో ఎందుకు.. ఇక్కడే తాగండి.. తాపించండి.. అంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా 129 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు రానున్నాయి. పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఇందులో 5 లక్షల జనాభాలో లోపు ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లకు వార్షిక ఫీజు రూ.5లక్షలుగాను, 5 లక్షల నుంచి 7.5 లక్షల జనాభా గల మద్యం దుకాణాలకు వార్షిక ఫీజు రూ.7.5 లక్షలుగాను నిర్ణయించారు. జిల్లాలో రూ.5 లక్షల పరిధిలో వచ్చే పర్మిట్ రూమ్‌లు 33 ఉండగా, రూ.7.5 లక్షల ఫీజు చెల్లించాల్సిన దుకాణాలు 96 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి ఎకై ్సజ్ శాఖకు రూ.8.85 కోట్ల ఆదాయం రానుంది.
మందుబాబులకు
మద్యంతోపాటు సకల సౌకర్యాలు
ఇప్పటికే నియంత్రణ లేక
ఛిద్రమవుతున్న కుటుంబాలు
పర్మిట్ రూములతో మరింత
పెరిగే అవకాశం
తీవ్రంగా మండిపడుతున్న
ప్రజా, మహిళా సంఘాలు