
వేడుకలకు ముస్తాబు
స్వాతంత్య్ర
● వేడుకల్లో ముఖ్యఅతిథిగా
పాల్గొననున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల
● ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: 79వ స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడకలు నిర్వహించే ప్రాంగణాన్ని తివర్ణ పతాకాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు పరేడ్‌ను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసు, ఎన్‌సీసీ దళాల అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ సందేశం అందిస్తారు. తరువాత మువ్వన్నెల బెలూన్లు ఎగురవేయడం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, శకటాల ప్రదర్శన ఉంటుంది. 10.15గంటలకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 11.41గంటలకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు. ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అతిథులు సందర్శించిన అనంతరం జాతీయ గీతాలాపనలో కార్యక్రమం ముగుస్తుంది.
ఏర్పాట్లు పరిశీలన..
పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు గురువారం పరిశీలించారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీల గ్యాలరీలు, స్టాల్స్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో మురళీ, ఆర్డీఓ మధులత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.