
పొంగిపొర్లుతున్న వాగులు
చిలకలూరిపేట నియోజకవర్గంలో హై అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వరద నీరు రోడ్లపై ప్రవహించే సమయంలో వాహనాలను నడపవద్దని, లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకల వద్దకు ఎవరూ వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. లో–లెవెల్ వంతెనల వద్ద నీరు ప్రవహించే ప్రదేశాలలో ప్రజలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వరద ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొంగిన వాగులు – నిలిచిన రాకపోకలు
నాదెండ్ల: భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గణపవరం–చిలకలూరిపేట డొంక రోడ్డులోని కుప్పగంజివాగు లోలెవల్ చప్టాపై నాలుగడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ సిబ్బంది రాకపోకలను నిలిపివేయించారు. తహసీల్దార్ ఎస్. చంద్రశేఖర్, ఎస్సై జి. పుల్లారావు వరద ఉధృతిని పరిశీలించారు. గణపవరం కుప్పగంజివాగు పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. అమీన్‌సాహెబ్‌పాలెం, గొరిజవోలు రోడ్లపై వరదనీరు ప్రవహించింది. మరో రెండు రోజుల పాటు వర్షాల ప్రభావంతో వరద కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు