పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన | - | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

Aug 14 2025 6:57 AM | Updated on Aug 14 2025 6:57 AM

పల్నా

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

దెబ్బతిన్న పత్తి పంట
కృష్ణమ్మ ఉగ్రరూపం

జిల్లాలో ముందస్తు ఖరీఫ్‌లో భాగంగా వేసిన ముదురు పత్తి పంట భారీ వర్షాలకు దెబ్బతింది. పత్తి విరుపులు స్తంభించిపోతున్నాయి. పగిలిన పత్తి తడిసిపోయింది. అలాగే పక్వానికి వచ్చిన కాయలు బాగా తడవడం వల్ల కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. లేత పత్తికి వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. భారీ వర్షాలకు నారుమళ్లు దెబ్బతింటున్నాయి. వరదనీటితో నారుమళ్లు కోతకు గురవుతున్నాయి. మళ్లీ నారుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం సంభవించే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారీవర్షాలకు రైల్వేశాఖ అప్రమత్తమైంది. పిడుగురాళ్ల – బెల్లంకొండ మధ్య భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి నెంబర్‌ 59 వద్ద నీరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. రైళ్ల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు తగ్గించారు.

సాక్షి, నరసరావుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పల్నాడు జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షాలు కురిసాయి. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం దాకా సుమారు 190 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రామాలకు బుధవారం ఉదయం రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాస్థాయిలో పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో 08647052999 నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. క్రోసురు మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని భారీ వదరనీరు చుట్టిముట్టిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్‌ రెడ్డిలు పర్యటించారు. గ్రామంలో హసనాబాద్‌ రోడ్డులో లోలెవల్‌ చప్టాపై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్‌ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు.

జిల్లాలో 189 సెం.మీ వర్షపాతం

నరసరావుపేట రూరల్‌: జిల్లాలో బుధవారం రికార్డు స్ధాయి వర్షపాతం నమోదు అయింది. గడిచిన 36 గంటల్లో జిల్లాలో 189 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు 169 సెం.మీ, అప్పటినుంచి సాయంత్రం 4గంటల వరకు 20 సెంమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా పెదకూరపాడులో 19 సెం.మీ, బెల్లంకొండలో 14సెం.మీ, దాచేపల్లి రూ.14సెం.మీ, అచ్చంపేటలో 13 సెం.మీ, మాచవరం 11 సెం.మీల వర్షం కురిసింది. అలాగే కారంపూడి, రాజుపాలెం, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో భారీ వర్షం నమోదు అయింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జిల్లాలోని 28 మండలాల్లో భారీ వర్షాలు నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు వర్షాలు ఇలాగే కొనసాగితే ముదురు పత్తి, నారుమళ్లకు తీవ్ర నష్టం పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

నిలిచిన రాకపోకలు

భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల – జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి – కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

పెదకూరపాడు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చపాట్లు కూలిపోయ్యియి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృత్తికి కూలిపోయింది.

75 త్యాళ్లూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్‌ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

యడ్లపాడు మండలం సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్‌ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట – ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది.

గురజాల – కారంపూడి రహదారిలో చర్లగుడిపాడు వద్ద లో లెవల్‌ చప్టా ఉండటం వలన వర్షపు నీరు నిలిచి రోడ్డుపైకి చేరింది.

మాచర్ల – గుంటూరు రహదారిపై రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై గుండా పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల – గుంటూరు మధ్య అన్నివాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ వేణుగోపాల్‌, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్దీకరించారు.

గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి.

కష్ణానది పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలకు కష్ణమ్మ పోటెత్తింది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి 2,30,540 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి 26 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 22గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు స్పిల్‌వే మీదుగా 2,34,850 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,339 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన గల కష్ణానదిలోకి మొత్తం 2,63,189 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 16 క్రస్ట్‌గేట్లు ద్వారా 2,75,166 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. టెల్‌పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 10 క్రస్ట్‌గేట్లు 3.5 మీటర్లు, 6 క్రస్ట్‌గేట్లు మూడు మీటర్లు ఎత్తు ఎత్తి 2,75,166 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో 3,50,841 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి నదిలోకి 3,64,082 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణానది ఉధృతంగాప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం అలెర్ట్‌ జారీ చేసింది.

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన1
1/4

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన2
2/4

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన3
3/4

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన4
4/4

పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement