
తెరిపివ్వని వాన..పొంగుతున్న వాగులు
సొలస గ్రామంలో లోలెవల్ చప్టాపై నీరు ప్రవహించడంతో రాకపోకలు బంద్
యడ్లపాడు: యడ్లపాడు మండలం పరిధిలో అన్ని గ్రామాల్లోనూ వానలు కురిశాయి. మంగళవారం రాత్రి మొదలైన ఈ వర్షం బుధవారం కూడా చిరుజల్లుల రూపంలో వర్షిస్తూనే ఉంది. దీంతో 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలంలోని గ్రామాల్లో ప్రజలకు, పశువులకు, అలాగే ఆస్తినష్టం వంటివి ఏమీ లేవని తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు. వర్షం, వాగుల నుంచి వరద పూర్తిగా తగ్గేవరకు సెల్‌నంబర్: 9849904026, 88862 70330 ప్రత్యేక నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీఆర్వోలు, వీఆర్‌ఏలు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమైతే తక్షణమే గ్రామస్థాయి అధికారులకు లేదా కంట్రోల్ రూం నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఎగువ నుంచి వాగుల ద్వారా వచ్చే వరద నీరు అధికమైతే నక్కవాగు పొంగే అవకాశం ఉంటుందని, లోతట్టు గ్రామాలైన జాలాది, దింతెనపాడు, గణేశునివారిపాలెం, తుర్లపాడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు కురిసిన వానలకు, ఇలాగే కొనసాగినా పంటలకు ఎలాంటి నష్టం ఉండదని ఏవో ఎ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం రాత్రి వీచిన గాలులకు పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపోవడంతో లింగారావుపాలెం, సొలస, ఉన్నవ గ్రామాల్లో సరఫరా నిలిచిందని, సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందిని బృందాలుగా అప్రమత్తం చేసి తిరిగి పునరుద్ధరణ చేసినట్లు విద్యుత్ ఏఈ జెస్సీ జయకర్ తెలిపారు.
అక్కడ రాకపోకలు బంద్...
వానలకు మండలంలోని వాగులు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి. సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట –ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది.

తెరిపివ్వని వాన..పొంగుతున్న వాగులు