
చిరస్మరణీయులు ‘ఉన్నవ’
యడ్లపాడు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించారు. అహింస అనే ఆయుధంతో తెల్లదొరల పాలనకు ముగింపు పలికి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. హిందీలో ఆయన చేసిన ఉపన్యాసాలు లక్షలాది ప్రజలను కదిలించాయి. అయితే ఆంధ్ర ప్రజల హృదయాల్లో గాంధీ సందేశాన్ని నింపిన ఒక మహనీయుడు ఉన్నారు. ఆయనే ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన రాజగోపాలకృష్ణయ్య హిందీ భాషలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. గాంధీజీ ఉపన్యాసాలను తెలుగులోకి తర్జుమా చేసి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
హిందీ అనువాదం...
ఆయన ఉపన్యాసాలు హిందీలో ఉన్నప్పటికీ, వాటిని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర ప్రజలకు దేశభక్తిని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. గాంధీజీ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడల్లా ఆయన ఉపన్యాసాలను అద్భుతంగా తెలుగులోకి అనువదించేవారు. గాంధీజీ సైతం ఆయన భాషా నైపుణ్యాన్ని గుర్తించి, తన పక్కనే ఉంచుకుని అనువాదం చేయించుకునేవారు. రాజగోపాలకృష్ణయ్య కేవలం అనువాదకుడిగా మాత్రమే కాకుండా, ఒక గొప్ప దేశభక్తుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు.
ఎడ్లబండ్లపై భారీ ప్రదర్శన...
గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఆయన, అప్పట్లో ఉన్నవ గ్రామంలో మహాత్ముని విగ్రహాన్ని ఎడ్లబండిపై ఉంచి, కాంగ్రెస్ జెండాలు, గాంధీ టోపీలతో 62 బండ్లతో ఒక భారీ ఊరేగింపు నిర్వహించారు. నాడు ఈ ఊరేగింపు యువతలో ఉత్తేజాన్ని నింపి, గొప్ప దేశభక్తిని రగిలించింది. 1946 ఫిబ్రవరి 5న ఖమ్మంలో జరిగిన బాపు చివరి బహిరంగ సభలో కూడా రాజగోపాలకృష్ణయ్య గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. గాంధీజీ ఆలోచనలను, సందేశాలను తెలుగు ప్రజల గుండెల్లోకి చేర్చడంలో ఆయన చేసిన కృషి అమోఘం, అనిర్వచనీయం. అందుకే ఆయన్ని గాంధీజీ ఉపన్యాసాలకు ‘అనువాద బ్రహ్మ’ అని పిలుస్తారు. రాజగోపాలకృష్ణయ్య వంటి నిస్వార్థ దేశభక్తులు తమ త్యాగాల వల్ల రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారు.
గాంధీ ఉపన్యాసాలకు తెలుగు అనువాదకులు ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య

చిరస్మరణీయులు ‘ఉన్నవ’