
నేడు పాఠశాలలకు సెలవు
నరసరావుపేట ఈస్ట్: నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి చంద్రకళ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పాఠశాలలకు ప్రకటించాలని కోరారు.
వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్
దొడ్లేరు(క్రోసూరు): భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలతో వచ్చిన వరదలను బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో హసనాబాద్ రోడ్డు లో లోలెవల్‌చప్టా పై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఊటుకూరు, బయ్యవరం మీదుగా అమరావతి వెళ్లారు. వారి వెంట తహసీల్దార్ వి.వి.నాగరాజు, ఎస్‌ఐ పి.రవిబాబు ఉన్నారు.
అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి
పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్‌నగర్‌లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన నేలపాటి సురేష్‌బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్‌లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.

నేడు పాఠశాలలకు సెలవు

నేడు పాఠశాలలకు సెలవు