
యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా
మహిళ దుర్మరణం
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరు బయలుదేరాడు. తోడుగా ఉంటుందని తన భార్య షేక్ షంషాద్(47)ను వెంట తీసుకెళ్లాడు. హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కిందకు ఒరిగి షంషాద్‌పై యాసిడ్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్‌ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. షంషాద్ మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.