తొలగని వసతి గ్రహణం
జేఎన్‌టీయూఎన్‌లో నిలిచిన వసతి గృహ నిర్మాణాలు
నరసరావుపేట రూరల్: జేఎన్‌టీయూఎన్ కళాశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలోనూ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వసతి గృహాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. గత పదినెలలుగా పనులకు జరగకపోవడంతో వసతి గృహాల నిర్మాణాల పూర్తికావడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నిలిచిన వసతి గృహాల పనులు
విద్యార్థీ, విద్యార్థినుల వసతి గృహాలను దాదాపు రూ.32కోట్లతో నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు అంతస్తులతో నిర్మిస్తున్న భవనాల పనులు గత ఏడాది మే నెలకు పూర్తిచేశారు. విద్యార్థుల వసతి గృహం రెండవ బ్లాక్‌లో మూడవ అంతస్తు, సెప్టిక్ ట్యాంక్ పనులు మిగిలిపోయాయి. విద్యార్థినుల వసతి గృహాంలోని రెండు బ్లాక్‌లో శానిటరీ ఫిట్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు అవసరమైన అంచనాలను ఇంజినీరింగ్ విభాగం తయారు చేసి వర్సిటి అనుమతి కోసం పంపింది. అయితే ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించలేదు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
కళాశాలలో సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లలో విద్యాబోధన జరుగుతుంది. ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్లు కేటాయించారు. ప్రతి ఏడాది 300 మంది విద్యార్థులు కళాశాలలో చేరుతున్నారు. ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలలో 1200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. దీంతో పాటు రెండు బ్రాంచ్‌లలో ఎంఎస్‌ను పూర్తిచేసేందుకు 120మంది విద్యార్థులు ఉన్నారు. కళాశాలలో వసతి గృహాలు లేకపోవడంతో వీరు పట్టణంలోని ప్రైవేటు హాస్టళ్లపై ఆధారపడుతున్నారు. ఇది వారిపై ఆర్థికభారంగా మారింది. దీంతో పాటు కళాశాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. ఆటోల మీద ఎక్కువగా విద్యార్థులు ఆధారపడుతున్నారు. ఆటోల్లో వెళుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఆర్టీసీ సౌకర్యం ఉన్నా మెయిన్‌రోడ్డు వరకే ఉంటుంది. అక్కడి నుంచి 1.5 కిలోమీటరు విద్యార్థులు నడిచివెళ్లాల్సి వస్తుంది.
అదే నిర్లక్ష్యం
2016లో జేఎన్‌టీయూఎన్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించింది. కళాశాలకు కాకాని వద్ద కేటాయించిన భూముల చుట్టూ ప్రహరీని కూడా ఐదేళ్లలో పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవనాల నిర్మాణాలను వేగవంతం చేశారు. కరోనా సమయంలోనూ భవన నిర్మాణాలను చేపట్టారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లు పూర్తికావడంతో విద్యార్థులకు తరగతులు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. ఇదే విధంగా వసతిగృహాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణలు పూర్తిచేయాలని భావించారు. ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా ఇప్పటికి నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.32కోట్లతో భవనాల నిర్మాణం ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.10కోట్లు అవసరం ప్రభుత్వ అనుమతి కోసం పది నెలలుగా ఎదురుచూపు ఈ విద్యాసంవత్సరంలో అందుబాటులోకి రావడం అనుమానమే ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నిర్మాణాలు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం
నిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలి
జేఎన్‌టీయూఎన్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతి గృహాల నిర్మాణాలు పూర్తిచేయాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణం పూర్తచేసింది. మైనర్ వర్క్‌లు పూర్తిచేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి తెస్తాం
కళాశాల వసతి గృహాలకు సంబంధించిన మేజర్ పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి పంపించాం. ప్రభుత్వం మారడం, నూతనంగా వీసీ రావడం వలన కొంత ఆలస్యం జరిగింది. నూతన వీసీ సెప్టెంబర్‌కు భవనాల నిర్మాణాల పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారు.
– ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూఎన్ కళాశాల
తొలగని వసతి గ్రహణం
తొలగని వసతి గ్రహణం


