తెలుగువారందరూ వావిలాలను స్మరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తెలుగువారందరూ వావిలాలను స్మరించుకోవాలి

Apr 30 2025 5:09 AM | Updated on Apr 30 2025 5:09 AM

తెలుగువారందరూ వావిలాలను స్మరించుకోవాలి

తెలుగువారందరూ వావిలాలను స్మరించుకోవాలి

సత్తెనపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్యను తెలుగువారందరూ స్మరించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్థంతిని పురస్కరించుకొని వావిలాల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతి వనంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ దేశం కోసం వావిలాల చేసిన పోరాటాలు, ఉద్యమాలు, స్మరించుకోవాలన్నారు. చాలా నిరాడంబరంగా జీవించి ఆంధ్ర గాంధీగా పేరు పొందిన వావిలాల అందరికీ ఆదర్శమని కొనియాడారు. నిత్యం ప్రజలను చైతన్యం చేసి ప్రజాభివృద్ధికై పాటుపడిన వావిలాల మన సత్తెనపల్లి వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య నాలుగు పర్యాయాలు సత్తెనపల్లి శాసనసభ్యుడిగా గెలిచి నిస్వార్ధంగా సేవలందించాడన్నారు. రచయితగా, జర్నలిస్టుగా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రారంభానికి, గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు భాషాభివృద్ధికి అవిరళ కృషి చేసిన మహనీయుడన్నారు. నేటి శాసనసభ్యులు వావిలాలను స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా పని చేయాలన్నారు. వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల మనవడు మన్నవ సోడేకర్‌ నేతృత్వంలో జరిగిన వర్థంతిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజ నారాయణ, సీనియర్‌ నాయకుడు పక్కాల సూరిబాబు, నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు షేక్‌ నాగూర్‌ మీరాన్‌, రమావత్‌ కోటేశ్వరావు నాయక్‌, నాయకులు అచ్యుత శివప్రసాద్‌, గంగారపు అనూష తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి వావిలాల 122వ వర్థంతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement