
పెట్రోలు ట్యాంకర్ బోల్తా
చేబ్రోలు: సడన్‌గా బ్రేక్ వేయడంతో పెట్రోలు ట్యాంకర్ లారీ బోల్తా పడిన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి నుంచి చీరాలకు పెట్రోలుతో వెళ్తున్న హెచ్‌పీ కంపెనీ లారీ చేబ్రోలు మండలం నారాకోడూరు జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దగ్గరకు వచ్చేవరకు స్పీడ్ బ్రేకర్ కనిపించక, డ్రైవర్ సడన్ బేక్ర్ వేయడంతో ఘటన జరిగింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన పెట్రోలు ట్యాంకర్ డ్రైవర్ కె.వీరాస్వామికి గాయాలవటంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా ప్రాంతానికి ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్థన్, పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ, తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
బెంబేలెత్తిన స్థానికులు, వాహనదారులు
సుమారు ఎనిమిదివేల లీటర్లు పెట్రోలు ఉన్న ట్యాంకర్ లారీ బోల్తా పడటంతో పాటు కొంత లీకేజీ అవుతుండటంతో స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది పెట్రోలు ట్యాంకర్ లారీ చుట్టూ నురగ (ఫోమ్)ను స్ప్రే చేసి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. పొన్నూరు, గుంటూరు రోడ్డులో వాహన రాకపోకలను పోలీసులు నిలుపదల చేశారు. ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాల ద్వారా మళ్లించారు.
ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు
నారాకోడూరు జడ్పీ హైస్కూల్ ఎదురు జీబీసీ రహదారిపై పెట్రోలు ట్యాంకర్ బోల్తా పడటంతో పొన్నూరు, గుంటూరు రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను నారాకోడూరు వద్ద, పొన్నూరు వైపు నుంచి వచ్చే వాహనాలను చేబ్రోలు వద్ద ట్రాఫిక్ మళ్లించారు. దీంతో సింగిల్ రోడ్డు కావటంతో వాహనాలు ఎదురు ఎదురుగా వచ్చి పలు చోట్ల వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి.
త్రుటిలో తప్పిన ప్రమాదం..
డ్రైవర్‌కు గాయాలు
చేబ్రోలు మండలం నారాకోడూరు
జెడ్పీ హైస్కూల్ వద్ద ఘటన