అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం సందర్శించకపోవడం బాధాకరం
నరసరావుపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులు అర్పించి ఉంటే చాలా బాగుండేదని గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. కానీ ఆయన ఆ పనిని ఉద్దేశపూర్వకంగానే చేయలేదని తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో... శిల్పాన్ని అంటరానిదిగా, స్వరాజ్ మైదానంలో వెలిసిన ఆ జాతీయస్థాయి కట్టడాన్ని బహిష్కరించారా అన్నట్లుగా ఏడాది గడుస్తున్నా ఆ ప్రాంగణంలోకే రాకుండా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు. ఆ మహా కట్టడాన్ని నిర్మించడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన పాపమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గతంలో చేసిన ఓ వ్యాఖ్య ద్వారా తన కుసంస్కారాన్ని, అగ్రకుల దురభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఈ కులం కంపు భావానికి పూర్తి భిన్నంగా కొండపైన గాంధీ – కొండ కింద అంబేడ్కర్ అనే ఉదాత్తమైన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఇరువురు దేశ నాయకులకు సంబంధించిన ఈ రెండు దర్శనీయ క్షేత్రాలకు ప్రాచుర్యం కల్పించాలని కోరారు. విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గాంధీ కొండపై గతంలో గాంధీ గ్రంథాలయం, ఫొటో ప్రదర్శనశాల, బాలలకు కొండ చుట్టూ తిరిగే రైలు బండి, విజ్ఞానదాయకమైన నక్షత్ర ప్రదర్శనశాల ఉండేవని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించి అంబేద్కర్ మైదానంలో ఇతర హంగులు కల్పించి నిత్యం సందర్శకులతో కళకళలాడేలాగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిని విస్మరించి, మహోన్నత కట్టడాన్ని పీ ఫోర్ పేరుతో ప్రైవేటు వ్యాపార వ్యవస్థకు అప్పజెప్పబూనడం దుర్మార్గమని తెలిపారు. ఆ మహానేతకు అపచారమని పేర్కొన్నారు. నగరపాలక సంస్థే నేరుగాగానీ, ప్రభుత్వ ఆధీనంలో ట్రస్ట్ ఏర్పాటు ద్వారాగానీ నిర్వహించాలని సూచించారు. జాతీయ స్థాయి కలిగిన ఈ దర్శనీయ క్షేత్రాలను బాబు ప్రభుత్వం ఇప్పటికై నా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంబేడ్కర్, గాంధీ అభిమానులు, దళిత సంఘాలు, ప్రజలు ఈ మేరకు కోరుతున్నారన్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు తీరుపై గాంధీస్మారక సమితి
రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజం


