నరసరావుపేట: మాతా శిశు సంరక్షణలో గౌరవ వేతనం తీసుకుంటూ విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు తగదని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్‌కుమార్ అన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేపీ మెటిల్డాదేవి అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సందర్భాలలో అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని, ప్రస్తుతం రాజకీయ వేధింపులతో పాటు అధికారుల వేధింపులు కూడా తోడయ్యాయన్నారు. వీటికి నిదర్శనమే సత్తెనపల్లిలో అంగన్‌వాడీ జ్యోతి ఆత్మహత్యాయత్నం, నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంలో అంగన్‌వాడీ ఫాతిమా ఆత్మహత్యలన్నారు. ఆయా ఘటనలలో నిందితులపై ఇంతవరకు కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ ఒకవైపు వేధింపులు మరోవైపు యాప్‌లతో అంగన్‌వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారరన్నారు. సాంకేతిక సమస్యలతో మొబైల్ ఫోన్లు పనిచేయక అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధికారులు యాప్‌లో పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయకపోతే వేతనాల్లో కోత విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అదేవిధంగా 42 రోజుల పాటు చేసిన సమ్మె సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా హామీల అమలు డిమాండ్ల సాధనకు అవసరమైతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎ.లక్ష్మీ ప్రసన్న, నిర్మల, సాయి, మాధవి, పద్మ పాల్గొన్నారు.
సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు
గుంటూరు విజయ్‌కుమార్