కొరాపుట్‌ జిల్లాలోకి పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ జిల్లాలోకి పెద్దపులి

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించింది. శుక్రవారం కొరాపు ట్‌ జిల్లా అటవీ శాఖ అధికారు లు ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. ఈ పులి జిల్లా లోని సిమిలిగుడ–సునా బెడా ప్రాంతాల్లో సంచరిస్తోందని పేర్కొన్నారు. అందుకు తగ్గ పులి పాదముద్రలు కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఈ పులి కదలికలపై అనేక చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్‌ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 6 ప్రత్యేక బృందాలు పులి కదలికల కోసం గాలిస్తున్నాయన్నారు. పులి కదలికలు గమనించిన వారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలు

జయపురం: స్థానిక ఉన్నత పాఠశాలలో జాగరణ గోష్టి రాష్ట్రీయ ప్రచార సమితి ఆధ్వర్యంలో ‘నా కలల భారతదేశం’ అనే అంశంపై డ్రాయింగ్‌ పోటీలు శుక్రవారం నిర్వహించారు. శశిభూషన్‌ పట్నాయిక్‌ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో అనేక ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వారు భారతదేశం ఎలా ఉండాలని కలలు కంటున్నారో ఊహలను రూపమిచ్చి ప్రతిభను కనబరిచారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జయపురం సమితి అదనపు విద్యాధికారి సోమనాథ్‌ గదబ, పాఠశాల హెచ్‌ఎం సుధాకర పట్నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులు ఈనెల 11వ తేదీన కొరాపుట్‌లో జరగనున్న జిల్లాస్థాయి చిత్ర లేఖన పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.

నలుగురు జైలర్లు బదిలీ

భువనేశ్వర్‌: రాష్ట్రంలో నాలుగు జైళ్ల జైలర్లను బదిలీ చేశారు. ఈ మేరకు జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టరేట్‌ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, పూరీ జిల్లా జైలు జైలర్‌ శుభస్మిత బిస్వాల్‌ను జాజ్‌పూర్‌ సబ్‌ జైలుకు బదిలీ చేశారు. కటక్‌ సర్కిల్‌ జైలుకు చెందిన జైలర్‌ రఘునాథ్‌ మాఝీని బొణైగొడొ జైలుకు పంపారు. భువనేశ్వర్‌ ప్రత్యేక జైలు జైలర్‌ అబినాష్‌ బెహెరాను నవరంగ్‌పూర్‌ సబ్‌ జైలుకు, ఫుల్బాణి జైలు జైలర్‌ లలితేందు భూషణ్‌ దాస్‌ను కటక్‌ సర్కిల్‌ జైలుకు బదిలీ చేశారు.

30 ఆదర్శ పాఠశాలలకు

శంకుస్థాపన

రాయగడ: జిల్లాలో ప్రాథమిక విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడం, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో 30 గోదావరీశ్‌ మిశ్రా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో 630 ఆదర్శ పాఠశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి కేంఝర్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటిలో రాయగడ జిల్లాలో 30 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ సమితుల పరిధిలో ఈ పాఠశాలల నిర్మాణం చేపట్టనున్నారు. కళ్యాణసింగుపూర్‌లో ఆరు, బిసంకటక్‌లో ఐదు, రాయగడ, చంద్రపూర్‌లలో నాలుగేసి, మునిగుడలో మూడు, గుణుపూర్‌, కాసీపూర్‌లో రెండేసి, కొలనార, గుడారి సమితుల్లో ఒక్కో పాఠశాల చొప్పున్న ఏర్పాటు చేయనున్నారు. మీరావలి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాథ్యక్షురాలు ముంజుల మినియాక పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి భజన్‌లాల్‌ మాఝి, బైరాగి హలువ, కంపొమల్లిగాం ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసారాన్ని వీక్షించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో గోదావరీశ్‌ మిశ్రా ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఒక్కో పాఠశాలను సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడంతో పాటు ఒక్కోదానికి సుమారు రూ. ఐదు కోట్లు చొప్పున నిధులు కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement