కొఠియా వేదికగా ప్రతిపక్షం బల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

కొఠియా వేదికగా ప్రతిపక్షం బల ప్రదర్శన

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

కొరాపుట్‌: ఆంధ్రప్రదేశ్‌ వ్యవహరిస్తున్న తీరు పై ఒడిశాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం ప్రతిపక్ష బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలతో ఆ పార్టీకీ చెందిన అత్యున్నత కమిటీ కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ సందర్శించింది. ఈ ప్రాంతం లో 21 వివాదాస్పద గ్రామాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు భ్రుగు భక్షిపాత్రో మాట్లాడుతూ కొఠియాలో ఉన్న గనులను ఆదానీ కంపెనీలకు అప్పగించడానికి ఆంధ్ర, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా ఆడుతున్న త్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ప్రయత్నంగా అభివర్ణించారు. కొఠియాలో చంద్ర బాబు ప్రభుత్వాన్ని అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. ఇది ఒడిశా స్వాభిమాన్‌ పోరాటమన్నారు. ఎన్నికల ముందు ఆంధ్రా గో బ్యాక్‌ అన్న బీజేపీ నేడు చంద్రబాబు ఆక్రమణకి కొమ్ము కాస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర స్పోక్స్‌ పర్సన్‌, మాజీ ఎంపీ ప్రదిప్‌ నేరుగా చంద్ర బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొఠియాలో ఆంధ్ర ఎన్నికల ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. కొఠియాపై రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం చేతకాక కేవలం ఒక సబ్‌ కలెక్టర్‌ని గ్రామగ్రామాన పంపి చేతులు దులుపుకుందని తెలిపారు. ఒడిశా ప్రభుత్వం కొఠియాలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కనిపించడం లేదన్నారు. ఎస్‌ఐఆర్‌ సమస్య పై బీజేడీ అనేక సార్లు ఒత్తిడి చేస్తే బీజేపి మాత్రం మౌనం వహిస్తుందన్నారు. ఎస్‌ఐఆర్‌ వ్యవహారంలో తెలుగు దేశం మద్దతు కావాలి కాబట్టి సీఎం మోహన్‌ చరణ్‌ మఝి మౌనం వహిస్తున్నారని ప్రదీప్‌ మఝి పేర్కొన్నారు. మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతు త్వరలో ఒడిశాకి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈ సమస్యపై నిలదీయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్‌ చరణ్‌ మఝికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అంతకు ముందు కొఠియా ప్రధాన కేంద్రం వద్ద బీజేడీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ ఆందోళనలో మాజీ మంత్రి జగన్నాథ సారక, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి, కొరాపుట్‌ జెడ్పీ ప్రెసిడెంట్‌ సస్మిత మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం పొడాల్‌, పీతం పాఢీ, బీజేడీ నాయకులు నాగరాజు దొర, దుర్గా మిశ్ర, శివ పట్నయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement