మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ప్రాంతంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అధికంగా గిరిజనుల జీవనోపాధిగా గంజాయి పండించేవారు. అలానే అధిక ఆదాయం వస్తుందనే ఆశ కూడా ఉండేది. దీంతో మాఫియా మాటలు నమ్మి గంజాయి పండించేవారు. ఇప్పుడు మాఫియాను తరిమికొట్టి గంజాయి పంటను స్థానికులే నాశనం చేస్తున్నారు. తొలిసారిగా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా పాపర్‌మేట్ల పంచాయతీ సిలిమేటా గ్రామంలో గిరిజనులు గంజాయి సాగును కట్ చేసి తాము ఇకపై మంచి పంటలే పండిస్తామని తెలిపారు. ముఖ్యంగా మత్తు పదార్థాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన గంజాయి సాగుకు వ్యతిరేకంగా పోలీసు శాఖ నిరంతరం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ప్రభావంతో గ్రామస్తులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రామస్తులు గంజాయి సాగు ద్వారా ఆదాయం సంపాదించి తమ కుటుంబ అవసరాలను తీర్చుకునేవారు. అయితే ఈ ఏడాది గంజాయి సాగును నాశనం చేయడంతో ప్రస్తుతం వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో సంప్రదాయ పంటలైన వరి, రాగులు, పసుపు తదితర పంటల వైపు వారు దృష్టి సారిస్తున్నారు. ఈ పంటల ద్వారా కుటుంబ పోషణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు అవసరమైన సహాయాన్ని అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్పును తెలుసుకున్న ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ ఇద్దరు తమ సిబ్బందితో ఆ గ్రామానికి వెళ్లి గిరిజనులను ప్రశంసించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇదే బాటలో నడవాలని సూచించారు.


