మహానది జల వివాద పరిష్కారంపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

మహానది జల వివాద పరిష్కారంపై ఆశలు

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

● చర్చలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయి: సీఎం మాఝీ

భువనేశ్వర్‌: మహా నది జలాల పంపిణీ వివాద పరిష్కారంపై ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య చర్చలు నిర్మాణాత్మక దిశగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. న్యూ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయ్‌లతో కలిసి మాఝీ పాల్గొన్నారు. మహా నది జలాల పంపిణీ, నిర్వహణతోపాటు ఒడిశా ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, జలవనరుల పరిరక్షణపై చర్చించినట్లు వెల్లడించారు. వివాద పరిష్కారానికి పురోగతి సాధించేందుకు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) నిర్దేశించిన మూడు నెలల గడువులో ఇప్పటికే రెండు నెలలు గడిచాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, సంప్రదింపులు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతున్నాయని తెలిపారు. పరస్పర సహకారం, అవగాహనతో శాశ్వత పరిష్కారం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానది ఒడిశా ప్రజల జీవనాధారం. దాని నీటి లభ్యతను కాపాడటంతోపాటు రైతులు, ఇతర వినియోగదారుల అవసరాలకు భరోసా కల్పించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం అంతర్‌ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

సమావేశ నిర్ణయాలను వెల్లడించాలి: బీజేడీ

మహా నది జలాల పంపిణీ వివాదంపై న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాలని ప్రతిపక్ష బిజూ జనతా దళ్‌ (బీజేడీ) డిమాండ్‌ చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొన్న సమావేశం ఫలితాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పార్టీ నాయకుడు డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సాహు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో మహా నది ఎగువ ప్రాంతంలో నిర్మించిన బ్యారేజీలు, ఆనకట్టలు, ఇతర నిర్మాణాల వల్లే వివాదం తలెత్తిందని ఆయన ఆరోపించారు. వర్షా కాలం కాని సమయంలో నది, ఉప నదుల్లో ప్రవాహం తగ్గిపోవడం ఒడిశా నీటి అవసరాలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం కాని నెలల్లో ఒడిశాకు అవసరమైనంత నీరు అందేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎగువ ప్రాంతంలో నిర్మించినట్లు ఆరోపిస్తున్న బ్యారేజీలపై ప్రభుత్వం ఏం చేయనుంది? చత్తీస్‌గఢ్‌లోని పరిశ్రమలకు మహానది నుంచి ఎంత నీటిని సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీజేడీ కోరింది. ఒడిశాలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాద పరిష్కార ప్రక్రియ ప్రకటనలకే పరిమితం కాకుండా స్పష్టమైన నిర్ణయాలు, ఆచరణాత్మక చర్యలకు దారితీయాలని పార్టీ నాయకుడు అన్నారు.

నీటి లభ్యతపై స్పష్టతే కీలకం

మహానది జల వివాద పరిష్కారంలో చర్చల పురోగతితోపాటు, ఒడిశాకు నీటి లభ్యతపై భరోసా, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, నీటి వినియోగంలో పారదర్శకత ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరే ఒప్పందం ఎంత స్పష్టంగా ఉండి, ఎంత సమర్థంగా అమలు అవుతుందన్నదే ఈ దీర్ఘకాలిక వివాద పరిష్కారానికి కీలకం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement