భువనేశ్వర్: నీటిని పొదుపుగా వినియోగించి నీటి సంరక్షణను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహా పాత్రో ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం భువనేశ్వర్‌లో రాష్ట్ర వ్యాప్త సుజల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (వాట్కో) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 16 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నీటి సంరక్షణ–నేడు అవసరం, భవిష్యత్ తరాల భవితవ్యం అనే నినాదంతో చేపట్టిన ఈ ప్రచారం ద్వారా నీటి పొదుపు, సురక్షిత తాగు నీటి ప్రాధాన్యం, కలుషిత నీటి వల్ల వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నీటి వనరులను కాలుష్యానికి దూరంగా ఉంచడం, తాగు నీటిని పరిశుభ్రంగా నిల్వ చేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, సాధ్యమైన చోట నీటిని పునర్వినియోగించడం వంటి చర్యలను ప్రోత్సహించనున్నారు. ఇళ్లలోని నీటి నిల్వ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని ఈ ప్రచారంలో సాధారణ ప్రజల్ని చైతన్యపరుస్తారు.
నీటి సరఫరా మా బాధ్యత
నీటి సంరక్షణ మీ కర్తవ్యం అనే నినాదంతో ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్య ఆవశ్యకతను ప్రచారం చాటి చెప్పనుంది. నీటి సరఫరాలో సమస్యలు ఎదురైతే 155359, 1800–1216–833 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబు సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజారోగ్య ఇంజినీరింగ్ సంస్థ ఇంజినీర్ ఇన్ చీఫ్ బిలాస్ బెహెరా, వాట్కో మేనేజింగ్ డైరెక్టర్ దేబబ్రత మహంతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఆదా చేసే ప్రతి నీటి బొట్టు భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన, నీటి భద్రత కలిగిన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ఈ ప్రచారం సందేశమిస్తోందని వక్తలు పేర్కొన్నారు.


