న్యూస్‌రీల్
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రాష్ట్రంలో ఆహార భద్రతా శాఖ..
భువనేశ్వర్: రాష్ట్రంలో పండగ పబ్బాల సీజను ఆరంభమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆహార నాణ్యత, భద్రతను నిర్ధారించేందుకు ఆహార భద్రతా శాఖ నడుం బిగించి ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆహార భద్రతా కమిషనర్ డాక్టరు పోమా టుడు పర్యవేక్షణలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఉప జిల్లాలు, పట్టణ ప్రాంతాలు మొదలైన చోట్ల ఆహార వ్యాపార సంస్థలు విక్రయిస్తున్న మిఠాయిలు ఇతరేతర తినుభండారాల నాణ్యతని తనిఖీ చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 475 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించిన మేరకు మొత్తం 3,605 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. దీనితో పాటు సంబంధిత యజమానుల నుంచి రూ. 2,84,500 జరిమానా వసూలు చేశారు. వీటిలో భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలో ఽ61 నమూనాలను సేకరించి అత్యధికంగా 787 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసి రూ. 68,500 జరిమానా విధించారు. అదేవిధంగా కల్తీ కారణంగా కటక్ నగర పాలక సంస్థ (సీఎమ్‌సీ)లో 570 కిలోలు, రూర్కెలా నగర పాలక సంస్థ (ఆర్‌ఎమ్‌సీ)లో 123 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. జిల్లా స్థాయిలో కొనసాగుతున్న తనిఖీల్లో పూరీలో 120 కిలోలు, బాలాసోర్‌లో 98 కిలోలు, ఢెంకనాల్‌లో 95 కిలోలు, కేంద్రాపడాలో 95 కిలోలు, సుందర్‌గఢ్‌లో 70 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. కేంద్రాపడాలో రూ. 44,000, ఽఢెంకనాల్‌లో రూ.28,000, భద్రక్‌లో రూ. 31,500 జరిమానా విధించారు. వినియోగదారులకు సురక్షితమైన, పరిశుభ్ర ఆహార సరఫరా హామీ నిర్ధారణ ధ్యేయంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు ఆహార భద్రతా ప్రామాణికలపై ఆహార వ్యాపారులలో అవగాహన పెంచడంపై శాఖ దృష్టి సారించింది. ఆహార భద్రతా శాఖ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు, పరిశీలన ప్రచారాలను ముమ్మరం చేస్తుందన్నారు. ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యత, పరిశుభ్రత, లేబులింగ్‌ను తనిఖీ చేయాలని వినియోగదారులను హెచ్చరించారు.


