రాయగడ: ప్రయాణికులతోవెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి నియమగిరి కుర్లీ పంచాయతీలోని తువాగుడ ఘాటీ వద్ద ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. హజరిడంగ పంచాయతీలోని అంకుల్‌పదర్ గ్రామం నుంచి కొంతమంది మహిళలు కుర్లీ గ్రామానికి సమీపంలో గల ఒక పర్యాటక స్థలాన్ని చూసేందుకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో మొతం 11 మంది ప్రయాణిస్తుండగా ఇందులో సుకాంతి పడికాక, బబిత పడికాక, నీలావతి కుట్రుక, మహినాబతి టుయిక, రచన కుట్రుకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగత వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
హార్డ్‌కోర్ నేరస్తుడు హడప శివపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం
రాయగడ: హర్డ్‌కోర్ నేరస్తుడు హడపా శివపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించినట్లు ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు. హడపా శివపై రెండు దశాబ్దాలుగా హత్య, దోపిడీ, కిడ్నాప్ వంటి నేరాలకు సంబంధించి సుమారు 64 కేసులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం హడప శివ సంబల్‌పూర్ సర్కిల్ జైలులో ఉంచారు. వివిధ నేరాలకు సంబంధించి అతనిపై అనేక కేసులు నమోదై ఉండగా ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నాడు. రాయగడ జిల్లా సబ్ జైలు, మల్కనగిరి జిల్లా సబ్ జైలులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రభుత్వం అతడిని సంబల్‌పూర్ జైలుకు తరలించింది. ఇదిలా ఉండగా కొద్ది రొజుల క్రితం అతని కుమారుడు నిఖిల్ హత్యకు గురైన ఘటనతో రాయగడ పట్టణంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హడప శివ పలు నేర కేసులతో సంబంధం కలిగి ఉండటంతో జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఏ) పరిధిలోకి తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
సెల్ఫీ తీసుకుంటుండగా
కాలుజారి.. యువకుడి గల్లంతు
రాయగడ: జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువకుడికి సెల్పీ సరదా ప్రాణంపైకి తెచ్చింది. జిల్లాలొని కాసీపూర్ సమితి పరిధిలోని తయాంగీర్ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి కిందపడిన యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గల్లంతైన యువకుడు గొడిబాలి పంచాయతీ పరిధిలోని జెరేకా గ్రామానికి చెందిన చెంకా బిసోయి కుమారుడు జొక్ బిసాయి (16)గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జోక్ తన నలుగురు స్నేహితులతో కలసి తయాంగీర్ జలపాతానికి వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి పోయినట్లు తోటి స్నేహితులు తెలియజేశారు. వెంటనే వారంతా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడ నుంచి వారంతా కలసి గ్రామంలోని జోక్ కుటుంబీకులకు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది.
యాంత్రిక లోపంతో నిలిచిన భారీ వాహనం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ నుంచి గుణుపూర్ కు వెళ్లే రహదారి మలుపులో బంకనాల్ వద్ద భారీ వాహనం యాంత్రిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ఆయా మార్గాల గుండా రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు మధ్యలో ఉన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు నెట్టడంతొ రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
గల్లంతైన జోక్ బిసొయి


