విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

● బుడాగుడ ఎస్‌ఎస్‌డీ హాస్టల్‌లో అధ్వాన పరిస్థితులు

రాయగడ: విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన హాస్టళ్లలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని బుడాగుడ ఎస్‌ఎస్‌డి విద్యార్థుల హాస్టల్‌లో బయటకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, మూతలు లేని జాయింట్‌ బాక్సులు, రైలింగ్‌ లేని మెట్లు, శిథిలమైన మెట్లతో పాటు వర్షం పడితే పైకప్పు నుంచి నీరు కారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా విద్యార్థుల వసతి గృహాల్లో విద్యుత్‌ పరికరాలు, స్విచ్‌ బోర్డులు పిల్లలకు అందకుండా సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. అయితే బుడాగుడ హాస్టల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్విచ్‌ బోర్డులు, జాయింట్‌ బాక్సులు సరైన రీతిలో అమర్చకపోవడంతో వాటికి సంబంధించిన విద్యుత్‌ తీగలు బహిరంగంగా వేలాడుతున్నాయి. పలు జాయింట్‌ బాక్సులకు మూతలు కూడా లేకపొవడంతో ప్రమాదం పొంచి ఉంది. నాగావళి హాస్టల్‌లో ప్రవేశ ద్వారం వద్ద కూడా ఎంసీబీ స్విచ్‌ బాక్స్‌ మూత లేకుండా కనిపిస్తుంది. కొంత దూరంలో ఉన్న విద్యుత్‌ బోర్డు నుంచి స్విచ్‌లు బయటకు వచ్చి తీగలు వేలాడుతున్నాయి. మరోవైపు నల్లా బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్‌ పంప్‌కు సంబంధించిన విద్యుత్‌ తీగలు నేలపై పడి ఉన్నాయి. వాటికి పలు చోట్ల జాయింట్లు ఉండటంతో వర్షాకాలంలో నీటితో సంబంధం ఏర్పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్‌లోని పై అంతస్తుకు వెళ్లే మెట్లకు రెయిలింగ్‌ లేకపోవడం, మెట్లు కూడా శిథిలావస్థకు చేరుకోవడం మరో సమస్యగా మారింది. వర్షం పడినప్పుడు పై కప్పు నుంచి నీరు కారడంతో భవనం భయపెడుతోంది. ఇటీవల జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ హాస్టల్‌ నుంచి ఓ విద్యార్థి అదృశ్యమైన అనంతరం అతడి మృతదేహాం లభ్యమైన ఘటన నేపథ్యంలో జిల్లాలోని హాస్టళ్లలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో మౌలిక వసతులు, ముఖ్యంగా విద్యుత్‌ భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికల హాస్టల్‌లోకి ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా వెలుగులోకి రాలేదు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతుల సమస్యలపై ఐటీడీఏ, జిల్లా కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ను సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఎలాటటి స్పందన లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement