శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే విద్యుత్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించడమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో టీడీపీ ప్రభుత్వం బషీరాబాగ్ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విద్యుత్ విషయంలో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చి, అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీడి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దడం, కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం, జిల్లాకు ఐటీడీఏ వంటి హామీలేవీ నెరవేరలేదని గుర్తు చేశారు.


