మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా జగన్నాథ్ స్వామి బహుడా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ప్రత్యేక పూజలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ కూర్చుని మౌసమి మందరం నుంచి రథం బయలుదేరి దూర్గగూఢ వీధిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకున్నారు. 4 గంటలకు ప్రారంభమైన యాత్ర రథం 7 గంటలకు ఆలయం వద్దకు చేరింది.
కొరాపుట్, నబరంగ్‌పూర్‌లో..
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో బహుదా విజయ వంతంగా ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం గుండిచా మందిరాల వద్ద ఉన్న రథాల పై పొహండి నిర్వహించి విగ్రహాలు చేర్చారు. నబరంగ్‌పూర్‌లో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తొలి దర్శనం చేసుకున్నారు. రాజ పురోహితుడు నర్సింగ త్రిపాఠి చీపురుతో ఊడ్చి చెరాపొర నిర్వహించారు. రాత్రయ్యేసరికి రథాలు జగన్నాథ మందిరాలకు క్షేమంగా చేరుకున్నాయి.
బొయిపరిగుడలో..
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో మారు రథయాత్ర ఘనంగా జరిగింది, గుండిచామందిరం నుంచి బయలు దేరిన రథం జగన్నాథ మందిరం వద్దకు సాయంత్రం చేరింది. ఈ రథాయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో...
పర్లాకిమిడి: బహుడా సందర్భంగా గుండిచా మందిరం వద్ద శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభధ్రలకు పూజలు జరిపి పోహాండికి సన్నాహాలు చేశారు. తొలుత రథంపై సుదర్శనుడు, తరువాత బలభధ్రుడు, సుభధ్ర, జగన్నాథస్వామిని వేర్వేరు రథాలపై దైతాపతులు, సేవాయత్‌లు ఎక్కించారు. అనంతరం గజపతి వంశీయుల యువరాణి కళ్యాణీ గజపతి విచ్చేసి రథంపై సంప్రదాయంగా పూజలు చేసి, చెరా పొహారా చేపట్టారు. మూడు రథాలపై యువరాణి కళ్యాణీ గజపతి పూజల చేసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రధాలను మవుసీ (పిన్నిగారు) ఇంటివైపు బయలుదేరాయి. రాజవీధి మార్గమధ్యలో టౌను హాలు గేటు వద్ద మూడు రధాలను నిలిపివేశారు. శనివారం దశమి సంధర్భంగా శ్రీజగన్నాథ, బలరాములు పిన్నిగారి ఇంట్లో పిండి వంటలు స్వీకరిస్తారు.


