‘మన్‌ కీ బాత్‌’ జిల్లాస్థాయి శిక్షణా శిబిరం | - | Sakshi
Sakshi News home page

‘మన్‌ కీ బాత్‌’ జిల్లాస్థాయి శిక్షణా శిబిరం

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

మల్కన్‌గిరి: స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో మన్‌ కీ బాత్‌ జిల్లాస్థాయి శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నేత, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డొంబురు శిశా మాట్లాడుతూ 2014 అక్టోబర్‌ 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని 7 సమితులకు చెందిన బీజేపీ సమితి సభ్యులు పాల్గొన్నారు.

నీట్‌ విజేతలకు సన్మానం

కొరాపుట్‌: నీట్‌ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి సన్మానించారు. జిల్లా కేంద్రానికి చెందిన సచిదానంద కుమారుడు స్వాభిమాన్‌ మిశ్రకి 3,992వ ర్యాంకు, కొసాగుమ్డ సమితి కేంద్రానికి చెందిన కిషన్‌ కుమార్‌ మాలిక్‌ కుమారుడు దిశ్యాంశు కుమార్‌ మాలిక్‌కి 7,939వ ర్యాంకులు వచ్చాయి. దీంతో వారిద్దరి కుటుంబాలను ఎమ్మెల్యే కలుసుకొని అభినందించారు.భవిష్యత్‌లో బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు.

చిత్రంగపల్లిలో దివ్యాంగ నిర్ధారణ శిబిరం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి చిత్రంగపల్లి పంచాయతీలో భీమ భోయి దివ్యాంగ సామర్ధ్య అభియాన్‌ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు హాజరై దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులుగా గుర్తించిన వారికి దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే బస్సు, ట్రైన్‌ పాస్‌లను జారే చేసే ఏర్పాటు చేశారు. కలిమెల సమితి అభివృద్ధి శాఖ అధికారి ప్రదీప్‌కుమార్‌ కర్‌ ముఖ్యఅతిథిగా హాజరై 382 మంది దివ్యాంగుల పేర్లు నమోదు చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 154 మంది శారీరక (నడక ) వైకల్యం కలిగినవారు, 56 మంది దృష్టి లోపం ఉన్నావారు, 51మంది చెవిటి,మూగ దివ్యాంగులు, 16 మంది మానసిక ఆరోగ్య సమాస్యలతో బాధాపడతుండగా.. పది మంది ఎయిడ్స్‌ బాధితులు ఉన్నారు. 58 మంది వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసినట్టు అధికారులు వెల్లడిచారు.

అత్యాచారం కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష

భువనేశ్వర్‌: అంగుల్‌ జిల్లాలో ఒక యువతి, మైనర్‌ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో విచారణ జరిపిన అంగుల్‌ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి (ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు) శుక్రవారం కీలకమైన తీర్పును వెలువరించారు. ఈ కేసులో నలుగురు నిందితులకు జరిమానాతో పాటు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6, భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారిలో ప్రతి ఒక్కరికీ వివిధ సెక్షన్ల కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2024 సంవత్సరం ఆగస్టు 6న అంగుల్‌ ప్రాంతంలో 21 ఏళ్ల యువతి, ఒక మైనర్‌ బాలికకు బలవంతంగా మద్యం తాగించి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై నమోదైన కేసుపై పోలీసులు చర్యలు చేపట్టి, జీతూ సాహు, హృదయ చంద్ర ప్రధాన్‌, అసిత్‌ కుమార్‌ సాహు, దీపు అలియాస్‌ దివ్య రంజన్‌ అమంత్‌లను అరెస్టు చేశారు. అంగుల్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ రాహుల్‌ జైన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంఘమిత్ర శతపతి ఈ కేసును దర్యాప్తు చేశారు. కేసు నమోదైన 59 రోజుల్లో నేరారోపణ వివరాలు దాఖలు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన బలమైన శాసీ్త్రయ ఆధారాలు, వాంగ్మూలాలు, ఇతర సమాచారం ఆధారంగా న్యాయస్థానం నిందితులందరినీ దోషులుగా తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement