జయపురం: నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్‌వో) డిమాండ్ చేసింది. ఈ మేరకు జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడలో ఆందోళన చేపట్టారు. జిల్లా కన్వీనర్ లక్ష్మణ నాయిక్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐడీఎస్‌వో కొరాపుట్ జిల్లా కార్యదర్శి జగన్నాథ్ హరిజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యా విధానంపై క్రమంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థను బలహీన పరుస్తోందని ఆరోపించారు. అలాగే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు రఘునాథ్ కుమార్, దీపక్ గౌడ, లోకేష్ తాండియ, హిందూ ఖొర, రాహుల్ గౌడ, విష్ణు గౌడ, నంద గౌడ, సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


