మల్కన్‌గిరి: పరీక్షల్లో పాస్ చేయిస్తానని చెప్పి డబ్బును తీసుకొని మోసం చేసిన వ్యక్తిని బలిమెల పోలీసులు బాలేశ్వర్‌లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ సమితి బలిమెల ఎస్‌ఏసీ పదోవార్డులో నివసిస్తున్న బి.ఈశ్వరరావు కుమార్తె గత ఏడాది ఇంటర్ పరీక్ష రాసినప్పటికీ ఉత్తీర్ణత కాలేదు. దీంతో సమాధాన పత్రాల రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేశారు. ఆ సమయంలో బాలేశ్వర్ జిల్లా బాలిసాహికు చెందిన నిరంజన్ సేఠి అనే వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమై రూ. 30 వేలు చెల్లిస్తే అమ్మాయిని పాస్ చేయిస్తానని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన ఈశ్వర్‌రావు ముందస్తుగా రూ. 17 వేలు చెల్లించారు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం నిరంజాన్ ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మోసపోయినట్టు గమనించిన ఈశ్వర్‌రావు గత నవంబర్ నెలలో బలిమెల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మాలేశ్వర్‌లో ఉన్నట్టు గుర్తించి ప్రత్యేక బృందాన్ని ఐఐసీ ప్రభుదత్త మాల్లిక్ పంపించారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు బలిమెలకు గురువారం సాయంత్రానికి తీసుకొని వచ్చారు. పూర్తి విచారణ అనంతరం నిందితున్ని కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దేవదత్త మాళ్లిక్ తెలిపారు. కాగా నిందితుడు నుంచి రూ. 17 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


