● దాడిలో నలుగురికి గాయాలు
హిరమండలం: స్థానిక అంగురు వీధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలపై దాడిచేసి నలుగురిని గాయపరచింది. దీంతో వారిని హుటాహుటిన స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడి చేసింది. గత నెలలలో కూడా పది మందిపై దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను కొట్టి చంపేశారు.
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని సీతాపురంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్కు స్వైర విహారం చేస్తూ పలువురు మహిళలపై దాడి చేసింది. ఈ దాడిలో కె.ప్రశాంతి, టి.సీతమ్మ, టి.తులసమ్మ, టి.పద్మ, బి.శ్యామలకు గాయాలయ్యాయి. అలాగే నువ్వలరేవుకు చెందిన మహిళ చేపలు అమ్ముతుండగా ఒక్కసారిగా దాడి చేయగా ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. కాగా పిచ్చికుక్క నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం చేతికర్రలు పట్టుకొని గ్రామంలో తిరుగుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మెళియాపుట్టి: మండలంలోని బురద రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే రహదారికి ఆనుకుని ఒక వృద్ధుడి మృతదేహాన్ని కొంతమంది పాదచారులు బుధవారం ఉదయం గుర్తించారు. వారిద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ మహ్మద్ అమీర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని, ప్రమాదానికి కారణమైన వ్యక్తుల చెప్పులు, ఇతర వస్తువులు సంఘటనా స్థలంలో లభ్యమయ్యాయన్నారు. వృద్ధుడి వివరాలు తెలియడం లేదన్నారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధాశ్రమానికి
మతిస్థిమితం లేని యువకుడు
కవిటి: మండలంలోని కుసుంపురం పంచాయతీ జుత్తుపుట్టుగలో గత కొన్ని రోజులుగా చిరునామా తెలియని ఒక మతిస్థిమితం లేని యువకుడు సంచరిస్తున్నాడు. గ్రామంలో ఆలయ నిర్మాణ వేళలో అక్కడ సంచరించాడు. దీంతో ఉదారమైన మనసుతో గ్రామస్తులు అతడికి ఆహారం, తాగునీరు అందించి ఆదరించారు. తాజాగా అతడి మానసిక స్థితిని గుర్తించి నర్తు సారధి తదితర గ్రామ పెద్దలు మానవతా దృక్పథంతో స్పందించి, మతిస్థిమితం లేని వ్యక్తిని తలతంపర సమీపంలోని వృద్ధాశ్రమం(సీతయ్య ఫౌండేషన్) నిర్వాహకులతో మాట్లాడి వారికి బుధవారం అప్పగించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఎచ్చెర్ల: మండలంలోని కుశాలపురం గ్రామం బైపాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న బ్యాటరీల వ్యాను బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ౖను ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాను నుజ్జనుజ్జయ్యింది. వ్యానులో ఉన్న డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఒక బాలిక చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యాన్ బీహార్ నుంచి రాజమండ్రికి బ్యాటరీలతో వెళ్తోంది. ఎచ్చెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


