● ఒడిశాలో ఓటుకు నోటు
● పట్టుబడిన నిందితులు
భువనేశ్వర్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటుకు నోటు వ్యవహారం బట్టబయలైంది. ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపులను సూచిస్తుంది. సోమ వారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 4 స్థానాల కోసం ఐదుగురు పోటీదారులు బరిలో ఉన్నారు. ప్రధానంగా 4వ స్థానం కోసం స్వతంత్ర అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి మధ్య సిగపట్లు పోటీ నెలకొని ఉంది. వీరి గెలుపు అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతతా దళ్, కాంగ్రెసు తాత్కాలిక పొత్తుకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఓటుకు నోటు బట్టబయలు
అన్ని పార్టీలు ఓటింగ్ కోసం తుది దశ సన్నాహాల్లో తలమునకలై ఉఒడగా కాంగ్రెసు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు అధికార భారతీయ జనతా పార్టీ ఓటుకు నోటు అందజేసినట్లు పొక్కిన వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు కానుక ఎరగా పన్నిన వల చెదిరింది. 4వ స్థానం కోసం పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిని గెలిపించేందుకు భారతీయ జనతా పార్టీ ఈ అప్రజాస్వామ్య చర్యకు పాల్పడిందని ఆరోపణలు బలపడ్డాయి. ఈ విపత్తు నుంచి దూరంగా ఉంచేందుకు కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కర్ణాటకలో (బెంగుళూరు) విడిది ఏర్పాటు చేసి తరలించారు. కొనుగోలు కోసం బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే వర్గాలు కాంగ్రెసు ఎమ్మెల్యేల విడిదికి గుట్టుగా చేరుకుంది. ఈ వ్యవహారం బెడిసి కొట్టింది. కాంగ్రెసు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరిచేందుకు బ్లాంక్ చెక్ లు అందజేసిన బీజేపీ నాయకులు పట్టుబడ్డారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ బహిరంగపరిచారు.
నీరుగారిన బెంగుళూరు లాబీ
బెంగళూరులో ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో ఒడిశా నుంచి తరలి వచ్చిన 4 మందిలో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిలో 2 మంది తప్పించుకోగా, మిగిలిన 2 మంది పట్టుబడ్డారు. 2 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. రాజ్యసభ ఓట్ల కోసం 5 కోట్లు కానుకగా అందజేయడాన్ని వారు అంగీకరించారు.
పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెసు ఎమ్మెల్యేలను ప్రలోభాల ఉచ్చులో బిగించేందుకు విఫలయత్నం చేసిన అభ్యర్థుల వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉల్క తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యే రూ. 5 కోట్ల నగదు కానుకతో ప్రలోభపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగుళూరు విడిదిలో బస చేసిన ఎమ్మెల్యేల 8 ఓట్లు, భువనేశ్వర్‌లో మరో 6 ఓట్లు సురక్షితంగా ఉన్నాయని ఉలాకా గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. రాజ్య సభ ఎన్నికల్లో 4వ స్థానం చేజిక్కించుకునే సత్తా లేని భారతీయ జనతా పార్టీ అనైతికంగా ప్రలోభ రాజకీయాల్ని ప్రేరేపిస్తుంది. ఈ చర్య ప్రజాస్వామ్య ఖూనీగా విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ముందస్తుగా బహిరంగపరిచిన విషయం విదితమే.
పోలింగు ఏజెంట్లు వీరే
రాజ్యసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ద్విముఖ పోటీ తీవ్రంగా కొనసాగుతుంది. పోలింగు పురస్కరించుకుని ఆయా పార్టీలు తమ ఏజెంట్ల పేర్లను ప్రకటించాయి. ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్‌అధికార భారతీయ జనతా పార్టీ పోలింగు ఏజెంట్లుగా నియమితులయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే ప్రతాప్ కేశరి దేబ్ విపక్ష బిజూ జనతా దళ్ ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ కాంగ్రెస్ పార్టీ తరపున పోలింగు ఏజెంట్‌గా ఉంటారు.
క్రమశిక్షణ తాఖీదులు జారీ
రాజ్య సభ 4వ స్థానం కోసం రాష్ట్రంలో ప్రలోభ రాజకీయాలు ఊపందుకోవడంతో విపక్ష బీజేడీ, కాంగ్రెసు వర్గాలు తమ సభ్యులపట్ల డేగ కన్ను నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎవరి తరహాలో వారు అనుక్షణం సంప్రదింపుల్లో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో ఉభయ పార్టీల నుంచి కొంత మంది ఎమ్మెల్యేల జాడ కొరవడింది. వీరి దాగుడు మూతలు పార్టీ అధిష్టానానికి పెను సవాలుగా ఎదురు తిరగడంతో క్రమశిక్షణ చర్యల కింద జాడ కొరవడిన పరిస్థితులపై వివరణ కోరుతు ఉభయ బీజేడీ, కాంగ్రెసు వారి ఎమ్మెల్యేలకు తాఖీదులు జారీ చేశాయి.
కాంగ్రెసు ఎమ్మెల్యే దాశరథి గొమాంగోకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు పార్టీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. స్వయంగా హాజరై సమాధానం ఇవ్వాలని ఆదేశంలో కోరారు. సమయానికి రాకున్న, సంతృప్తికరమైన వివరణ దాఖలు చేయకున్న చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బిజూ జనతా దళ్ బలిగుడ నియోజక వర్గం ఎమ్మెల్యే చక్రమణి కంవర్, జయదేవ్ నియోజక వర్గం ఎమ్మెల్యే నబ కిషోర్ మల్లిక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విప్ జారీ చేసినప్పటికీ గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ముఖ్యమైన సమావేశాలకు వారిద్దరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆది వారం రాత్రి 9 గంటలలోపు నవీన్ నివాసానికి చేరుకోవాలని నోటీసులో పేర్కొన్నట్లు బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ తెలిపారు.


