ఘనంగా సంబాద్ సాహిత్య ఘర్ వార్షికోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సంబాద్ సాహిత్య ఘర్ 10వ వార్షికోత్సవాన్ని స్థానిక ఎంయూజే భవనంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త, కవి చక్రపాణి పరిచా పాల్గొన్నారు. ముఖ్యవక్తగా జిల్లా ప్రణాళిక బోర్డు ఉపనిర్దేశకుడు గోలక్ చంద్ర దళేయి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబాద్ సాహిత్య ఘర్ అధ్యక్షుడు డాక్టర్ రంజన్ కుమార్ స్వైయి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా రవేంద్ర కుమార్ మహరణా, సుకాంత సాహు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో జిల్లా సమన్వయకర్త ప్రమేంద్ర పరిచా సాహిత్య ఘర్ లక్ష్యాలు, ఉద్దేశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రవేంద్రనాథ్ ఠాగూర్ అమర కావ్య గ్రంథం గీతాంజలిపై సమాచార ప్రధానమైన ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో తారక్ మండాల్, ఆశోక్ కుమార్ షాడాంగీ, మానస్ రంజాన్ మాహపాత్రో, ఆశోక్ మిశ్రో, విక్రమ్ పాడీ, జితేంద్ర కుమార్ త్రిపాఠి, గుణనిధి లాబ్లా, ప్రకాష్ పట్నాయక్, రాహుల్ గోలారీ ఇతరులు పాల్గొన్నారు.


